BJP: సర్పంచ్ ఎన్నికల్లో పోటీపై బీజేపీ సంచలన నిర్ణయం

by Prasad Jukanti |

రాష్ట్రంలో ప్రధాన పార్టీలు సర్పంచ్ ఎన్నికలపై దృష్టి సారించాయి.

BJP: సర్పంచ్ ఎన్నికల్లో పోటీపై బీజేపీ సంచలన నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు మెంబర్ స్థాయి నుండి జడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు పంచాయతీ ఎన్నికలపై ఇవాళ ఇవాళ బీజేపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని ఈ సందర్భంగా రామచందర్ రావు అన్నారు.

ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ:

గత రెండు సంవత్సరాలలో పంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణను రూపొందించడంపై ఇవాళ సమావేశం నిర్వహించామన్నారు. గ్రామ పంచాయతీలన్ని దివాళా తీసే పరిస్థితికి బీఆర్ఎస్ తీసుకువస్తే దాన్ని కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రైతు వేదికలు, హరితహారం, శ్మశానవాటికలు ఏవి కట్టినా అవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులేనన్నారు. ఏ పని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా కేటాయించలేదన్నారు. ఉపాధి హామీ పథకం నిధులు కూడా డైవర్ట్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ దేనన్నారు. గ్రామీణ పేదలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

కామారెడ్డి డిక్లరేషన్ బూటకం అని తేలిపోయింది:

కామారెడ్డి డిక్లరేషన్ బూటకం అని తేలిపోయిందని బీసీలను ఏ రకంగా మోసం చేయాలని నూటికి నూరు శాతం కాంగ్రెస్ మోసం చేసిందని కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. మహిళలకు పండగలకు చీరలను పెడతారు. కానీ ఇవాళ రాష్ట్రంలో తద్దినాలకు చీరలను పంచిపెడుతున్న పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. రెండు బతుకమ్మ పండగలు పోయినా ఇవ్వని చీరలు గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందనగా హడావుడిగా పంపిణీ ప్రారంభించారని ఆరోపించారు. ఎలక్షన్స్ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వెంటనే చీరలు పంచుతూ మున్సిపాలిటిల్లో మాత్రం పంచడం లేదని ఇదంతా ఎన్నికల కోసమే చేస్తున్నారని అర్థం అవుతోందన్నారు. చీరలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారని ఈ చీరలకు నిధులు ప్రభుత్వం నుంచి కేటాయించారా లేక గాంధీ భవన్ నుంచి కేటాయించారా అని నిలదీశారు.

Next Story