కమలంలో లోకల్ కితకితలు.. ముదిరిన ఆధిపత్య పోరు!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-12 02:29:28  IST  )

రాష్ట్ర బీజేపీలో ఆధిపత్య పోరు ముదిరింది. సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేస్తూ, ఢిల్లీకి ఫిర్యాదుల లేఖలు పంపుతుండటంతో క్యాడర్ తీవ్ర అసహనంతో ఉంది.

కమలంలో లోకల్ కితకితలు.. ముదిరిన ఆధిపత్య పోరు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీలో గ్రూపు, ఆధిపత్య రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ఎవరికి వారు ఎదగాలనుకునే క్రమంలో.. సొంత పార్టీ నేతలపైనే బురదజల్లుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా పార్టీ కేంద్ర నాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే.. ఇక్కడి నాయకులు మాత్రం సొంత పార్టీ నేతలనే బలహీనం చేసేలా వ్యవహరిస్తున్నారని కేడర్ అసహనం వ్యక్తం చేస్తున్నది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. పార్టీలో ఇప్పటికే పాత, కొత్త, సీనియర్, జూనియర్ అంటూ విభజన స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. అయినా విపక్ష పాత్ర పోషించడంలో, అధికార పార్టీ విమర్శలను తిప్పికొట్టడంలో విఫలమయ్యారనే విమర్శలు సొంత పార్టీ కేడర్, నాయకుల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఒకరు చెబితే మేము వినాలా? అనే ధోరణి పెరిగిపోయిందని పార్టీలో చర్చ జరుగుతున్నది.

ఎవరికి వారే..

తాము సీనియర్ అని కొందరు నేతలు చెబుతుండగా.. తాము ప్రజల ద్వారా ఎన్నికై వచ్చామని మరికొందరు అంటున్నారు. ప్రజాప్రతినిధిగా గెలిచినా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇంకొందరు నిట్టూరుస్తున్నారు. ఎవరికివారీగా అగ్రనేతల దగ్గర ఇతర నాయకుల గురించి ఫిర్యాదులు చేస్తున్నారు. వారు చేస్తున్న వివాదాస్పద ప్రకటనలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇంకా కొందరు నేతలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని, ప్రత్యర్థి పార్టీల నాయకులతో అంతర్గత సంబంధాలు, వ్యాపారాలు ఉన్నాయని ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. లేఖలు కూడా రాస్తున్నట్లు తెలిసింది. ‘మీకు సమాచారం కోసం మాత్రమే ఇవి చెబుతున్నాం. పార్టీ మేలు కోరే ఇవి మీ దృష్టికి తీసుకువస్తున్నాం. ఎవరిపై ఫిర్యాదు చేయాలనేది మా ఉద్యేశ్యం కాదు’ అంటూనే ఫిర్యాదులు చేస్తున్నట్లుగా సమాచారం. ఇలా అయితే పార్టీకి నష్టమని, దీనిని సరిదిద్దాలని, నియంత్రించాలని, లేకుంటే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని ఎవరికోణంలో వారు పార్టీ పెద్దలకు సూచిస్తున్నట్లు తెలిసింది. పార్టీ అగ్రనేతల దృష్టిలో పడాలని, వారి వద్ద మార్కులు కొట్టేయాలని తాపత్రయపడుతూ.. ఇతర నాయకులపై ఆరోపణలు, వారి దందాలు, సెటిల్మెంట్లు, భూ వివాదాలు, ఆర్థిక అవకతవకలను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఇతర నాయకుల మీద బురద చల్లటమే లక్ష్యంగా ఇదంతా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

వ్యక్తిగతంగా బలోపేతమయ్యేలా..

రాష్ట్రంలోని కొందరు పార్టీ నాయకులు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరని, ప్రత్యర్థి పార్టీలపై కాకుండా సొంత పార్టీ నేతలపైనే పోరాటం చేస్తున్నారని పార్టీ కేడర్ చెబుతున్నారు. ఇలా అయితే పార్టీ ముందుకు ఎలా సాగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కేంద్రనాయకత్వం పావులు కదుపుతుంటే.. ఇక్కడి నాయకులు మాత్రం కలిసి ఉండటంలేదని, పార్టీ పటిష్టతకు కాకుండా వ్యక్తిగతంగా బలోపేతం కావాలని ప్రయత్నిస్తున్నారని, తమ నాయకత్వమే పార్టీకి అవసరమనే రీతిలో వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. తమ నాయకత్వమైతేనే పార్టీ రాష్ట్రంలో సులువుగా అధికారంలోకి వస్తుందని, ఎవరికి వారు ఢిల్లీ పెద్దల వద్ద, ప్రత్యక్షంగా, పరోక్షంగా చెబుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌పై పోరాటంలో బీజేపీ అంతంత మాత్రమే ఉండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ దూసుకుపోతున్నది. అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను ధీటుగా ఎదుర్కొంటూ ఓవర్ టేక్ చేయాల్సిన ముఖ్య నేతలు.. ఇలా ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదులతో కాలం వెళ్లదీస్తుండటంపై పార్టీ కేడర్ అసహనం వ్యక్తం చేస్తున్నది. ఇలా అయితే పార్టీ అధికారంలోకి రావడమేమో కానీ.. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ శాతమైనా నిలుపుకుంటే చాలని అభిప్రాయపడుతున్నది.

Next Story