మహిళలపై బీజేపీది కపట ప్రేమ.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ ఇందిరాశోభ‌న్‌

by Ramesh Naini |

మహిళా సాధికారతపై మోడీ స‌ర్కార్‌ చెబుతున్న మాటలన్నీ క‌ట్టుక‌థ‌లేనని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఇందిరాశోభ‌న్‌ మండిప‌డ్డారు.

మహిళలపై బీజేపీది కపట ప్రేమ.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ ఇందిరాశోభ‌న్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళా సాధికారతపై మోడీ స‌ర్కార్‌ చెబుతున్న మాటలన్నీ క‌ట్టుక‌థ‌లేనని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఇందిరాశోభ‌న్‌ మండిప‌డ్డారు. మ‌హిళ‌లపై బీజేపీకి ఉన్నది కేవ‌లం క‌ప‌ట ప్రేమ మాత్రమేన‌ని, ఉమెన్‌ బిల్లుకు డీలిమిటేష‌న్, జ‌న‌గ‌ణ‌న‌తో ముడిపెట్టడం మ‌హిళా లోకాన్ని వంచించ‌డ‌మే అవుతుంద‌న్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మ‌హిళా బిల్లును త‌క్షణ‌మే అమ‌లు చేయ‌డకుండా కాల‌యాప‌న చేసేందుకు ఇది మోడీ ప్రభుత్వం ప‌న్నిన పెద్ద కుట్ర అని ఇందిరాశోభ‌న్ ఆరోపించారు. అస‌లు పార్లమెంట్‌లో పెట్టిన సవరణలో మ‌హిళా బిల్లు ఊసే లేక‌పోవ‌డం విడ్డూర‌మ‌న్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీల‌కు సబ్ కోటా కేటాయించకపోవడం ఆ వర్గాల పట్ల బీజేపీకి ఎంత వివ‌క్ష ఉందో అర్థమ‌వుతంద‌ని, అట్టడుగు వర్గాలకు రాజకీయ భాగస్వామ్యం లేకుండా చేయడం ద్వారా మోడీ స‌ర్కార్‌ తన అసలు నైజాన్ని బయట పెట్టుకుందని ఇందిరా శోభన్ ఆరోపించారు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, 2010లోనే రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లును ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. అప్పుడు అడ్డుపడి, ఇప్పుడు కొత్త మెలికలు పెట్టడం కేవలం బీజేపీ ఓట్ల రాజకీయమేన‌ని, 2023 సెప్టెంబర్ లో పార్లమెంటులో ఆమోదం పొంది రాష్ట్రపతి రాజా ముద్ర కూడా అయ్యాక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ లబ్ధిపొంది మోసం చేసిందన్నారు.

2011 లెక్కల ప్రకారం ఆరోజే 2023 సెప్టెంబర్ నుండే అమలు చేసి ఉంటే చాలా రాష్ట్రాల్లో మహిళలు చట్ట సభల్లో ఉండేవాళ్ళని, మహిళా బిల్లు మీద తుపాకీ పెట్టి ఓబీసీ కోట గల్లంతు చేశారని, నారీ వందన బిల్లు కాదు నారీ వంచన బిల్లు అని ఇందిరాశోభ‌న్ ఆరోపణలు గుప్పించారు. బిల్లు వీగి పోయేలా పెట్టి నారీ వంచన చేసిన బీజేపీ, సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడం సిగ్గుచేటన్నారు. డీలిమిటేషన్ సాకుతో దక్షిణాది గొంతు నొక్కి, మళ్లీ అధికారంలోకి రావాలనుకోవడం బీజేపీకి పగటి కలగానే మిగిలిపోతుందని ఇందిరా శోభన్ విమర్శించారు. మహిళా బిల్లును ఎటువంటి నిబంధనలు లేకుండా తక్షణమే అమలు చేయాలని, అలాగే ఓబీసీలకు సబ్ కోటా కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళాలోకం తరపున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు.

Next Story