మహిళా రిజర్వేషన్లపై బీజేపీ కపట నాటకం: మంత్రి సీతక్క

by Ramesh Naini |

మహిళా రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలు బీజేపీ కపట నీతిని, మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న వివక్షను బయటపెట్టాయని రాష్ట్ర మంత్రి సీతక్క మండిపడ్డారు.

మహిళా రిజర్వేషన్లపై బీజేపీ కపట నాటకం: మంత్రి సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలు బీజేపీ కపట నీతిని, మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న వివక్షను బయటపెట్టాయని రాష్ట్ర మంత్రి సీతక్క మండిపడ్డారు. మహాత్మా గాంధీ చెప్పినట్లుగా లక్ష్యం మాత్రమే కాదు, ఆ లక్ష్యాన్ని సాధించే మార్గాలు కూడా మంచివే కావాలి అని, కానీ బీజేపీ ఆ దిశగా అడుగులు వేయడం లేదని ఆమె విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మహిళల సాధికారతపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, కేవలం సింపుల్ మెజారిటీతోనే రిజర్వేషన్ల బిల్లును ఆమోదింప చేసే అవకాశం ఉందని, కానీ కావాలనే డీలిమిటేషన్ అంశాన్ని జత చేసి బిల్లును సంక్లిష్టం చేశారని సీతక్క ఆరోపించారు. ఇది మహిళల హక్కులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కాదని, కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న నాటకమని ఆమె పేర్కొన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించారు.

మహిళా సాధికారత విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ దేశానికి మహిళా ప్రధానిని, మహిళా రాష్ట్రపతిని అందించిన ఘనత తమ పార్టీదేనని ఆమె స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, విద్య, ఉపాధి అవకాశాల్లో వారికి ప్రాధాన్యతనివ్వడం వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. బీజేపీ భావజాలమే మహిళా వ్యతిరేకమని ఆరోపించిన మంత్రి సీతక్క, లోక్‌సభ సాక్షిగా మహిళా రిజర్వేషన్లపై ఆ పార్టీకి నిజమైన చిత్తశుద్ధి లేదని స్పష్టమైందని అన్నారు. మహిళల సమాన హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ఆమె మరోసారి గట్టిగా డిమాండ్ చేశారు.

Next Story