బీసీలకే బీజేపీ ఫస్ట్ ప్రియారిటీ..! పార్టీ పదవుల్లో ఆ మూడు వర్గాలకు పెద్దపీట

by Kema Shiva Kumar |

బీసీలను తమవైపునకు తిప్పుకునేందుకు కమలనాథులు పెద్ద ప్రయత్నమే ప్రారంభించింది.

బీసీలకే బీజేపీ ఫస్ట్ ప్రియారిటీ..! పార్టీ పదవుల్లో ఆ మూడు వర్గాలకు పెద్దపీట
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలను తమవైపునకు తిప్పుకునేందుకు కమలనాథులు పెద్ద ప్రయత్నమే ప్రారంభించింది. త్వరలో ప్రకటించే బీజేపీ రాష్ట్ర కమిటీలో వారికి అగ్రస్థానం కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. జాతీయ అధ్యక్షుడి ఎంపిక తర్వాతే రాష్ట్ర కమిటీ ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రపార్టీ పగ్గాలు బీసీ నేతలకే అప్పగిస్తారని ఆరు నెలలుగా ప్రచారం జరిగినా చివరికి విధేయుడిగా ఉన్న ఓసీ నేతకే దక్కింది. దీంతో ఆ పార్టీలోని బీసీ నాయకులతో పాటు సామాజికవర్గాలు కూడా బీజేపీ వైఖరిని తప్పపడుతూ బీసీలను విస్మరించిందని విమర్శలు వెల్లువెతాయి. దీంతో బీసీలు పార్టీకి దూరమైపోతారనే భావనతో హస్తిన పెద్దలు కమిటీల్లో బీసీలకు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు వంటి కీలకమైన పదవులు అప్పగించి వారికి తగిన ప్రాధాన్యం ఇస్తుందనే సంకేతాలు ప్రజలకు పంపనుంది.

బీసీల్లో మెజార్టీ జనాభా కలిగిన యాదవ, ముదిరాజ్, పద్మశాలి కులాల నేతలకు సముచిత స్థానం కల్పించి ఆయా వర్గాలను తమవైపు తిప్పుకునేలా పార్టీ సీనియర్లు ప్లాన్​చేస్తున్నట్లు పార్లమెంటు సభ్యులు అంతర్గత సంభాషణలో వెల్లడించారు. ఈ విషయమై ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీ స్థాయిలో చర్చ జరిగినట్లు తెలిసింది. బీఆర్ఎస్ కు​రెండు పర్యాయాలు అధికారం అప్పగించడంలో బీసీలు కీలకపాత్ర పోషించడంతో వారికి రాజ్యసభ్య, ఎమ్మెల్సీ పదవులను కట్టబెట్టింది. ఈ మూడు కులాలను తమవైపునకు తిప్పుకుంటే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో విజయం సులభంగా సాధించవచ్చని పార్టీపెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.

కీలక నేతలకు బాధ్యతలు

ఇప్పటికే ముదిరాజ్​సామాజిక వర్గం నుంచి ఎంపీ ఈటల రాజేందర్ ఉండగా, యాదవుల నుంచి కాసం వెంకటేశ్వర్లు, పాండు యాదవ్, పద్మశాలి సామాజికవర్గం నుంచి టైగర్​నరేంద్ర కుమారులు ఉన్నారు. వారితో చర్చలు జరిపి చురుకైన నేతలను గుర్తించి కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీవర్గాల్లో చర్చ నడుస్తున్నది. వారిని పార్టీకి, రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లుగా పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తూ ఇతర పార్టీలు ఆఫర్లు ఇచ్చినా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తామని ప్రతినబూని కాషాయం జెండా వదలకుండా ఉన్నారు.

స్థానిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లు

త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థలు, ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మెజార్టీ సీట్లు గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మెజార్టీ సీట్లను కూడా బీసీ వర్గాలకే ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఫార్మాలా పనిచేస్తే ఆ తర్వాత జరిగే గ్రేటర్​హైదరాబాద్ ఎన్నికల​పోరులోనూ అమలు చేయొచ్చని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో ఆశించిన ఫలితాలు వస్తే 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్​కు మించి అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు ప్లాన్​చేస్తున్నట్లు పార్టీ కార్యాలయంలో చర్చ జరుగుతున్నది. అయితే కాంగ్రెస్​42శాతం బీసీ రిజర్వేషన్ల ఎత్తుగడలను చిత్తుచేసి బీసీలకు అండగా నిలిచి పార్టీగా ముద్రవేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.

Next Story