- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలన
తెలంగాణ రైతు సమస్యలపై పోరాడేందుకు బీజేపీ ‘రైతు ఘోష-బీజేపీ భరోసా’ పేరిట మూడు రోజుల పోరుబాటకు శ్రీకారం చుట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రైతుల సమస్యలపై పోరుబాటకు బీజేపీ సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెలుగులోకి తెచ్చేందుకు ‘రైతు ఘోష-బీజేపీ భరోసా’ (Rythu Ghosha - BJP Bharosa) పేరుతో 3 రోజుల పాటు వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లను బీజేపీ ప్రతినిధి బృందాలు సందర్శించనున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు నేతృత్వంలో ఈ పోరుబాట సాగనుంది. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల తీరును పరిశీలిస్తారు. తూకాల్లో జరుగుతున్న ఆలస్యం, తేమ శాతం పేరిట వేస్తున్న కోతలు, గిట్టుబాటు ధర వంటి అంశాలపై నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
ఈ మేరకు ఇవాళ వికారాబాద్ జిల్లా కులకచర్లలో బీజేపీ నేతలు పర్యటించనున్నారు. అక్కడ కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, స్థానిక రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డును సందర్శించి.. అక్కడ ధాన్యం నిల్వలు, రైతులకు అందుతున్న వసతులను పరిశీలిస్తారు. మంగళ, బుధవారాల్లో రేపు, ఎల్లుండి యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్ జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నట్లుగా రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఐకేపీ కేంద్రాల్లో రైతులు పడుతున్న గోసను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే కొనుగోళ్లు వేగవంతం చేసేలా ఒత్తిడి తెస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.






