మొక్కుబడిగా బీజేపీ వర్క్‌షాప్​ సమావేశం

by velandi.Saikiran |

మొక్కుబడిగా బీజేపీ వర్క్‌షాప్​ సమావేశం
X

మొక్కుబడిగా బీజేపీ వర్క్‌షాప్​ సమావేశం

ఒకవర్గం నేతలే హాజరైనట్లు పార్టీలో ప్రచారం

వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆరోపణలు

ఒక వర్గం కాంగ్రెస్​పై, మరో వర్గం బీఆర్​ఎస్​పై విమర్శల దాడి

పార్టీలో పొంతన లేకుండా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహారం

అధ్య క్షుని ఎంపిక జరిగితే అన్ని సర్ధుకపోతాయని సీనియర్ల వెల్లడి

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర బీజేపీ వర్క్‌షాప్​మొక్కుబడిగా జరిగినట్లు హాజరైన నేతలంతా పెదవి విరిచారు. పార్టీ కొత్త, పాత వర్గాలుగా చీలినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక వర్గం నేతలు వస్తే మరో వర్గం నేతలు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. వలస వచ్చి నేతలకు పార్టీ లో గౌరవం దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాత వర్గం నేతలంతా ఏవిధంగా పార్టీ ముందుకు నడిపిస్తారో తాము చూస్తామని కొత్త వర్గం నేతలు కన్నెర్ర చేస్తున్నారు. పార్టీ బహిరంగ సమావేశాలకు తప్ప కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయాల్లో తమను సంప్రందించడం లేదని ఇప్పటికే మీడియా చిట్​చాట్​లో ఆవేదన వ్యక్తం చేశారు. అయిన పార్టీ సీనియర్లు పెడచెవిన పెడుతూ ఉన్నవారే ఉంటారు...పోయేవారు పోతారే భావనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు పలుమార్లు పదాధికారుల సమావేశం జరిగిన సీనియర్లు ఐదారుగురు తప్ప పూర్తిగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ హాజరు కావడం లేదని, సమావేశానికి వచ్చిన వారంతా ఒకే వర్గానికి చెందిన నేతలుగా పార్టీలో ప్రచారంలో జరుగుతోంది. ప్రజా ప్రతినిధులకు ఆలస్యంగా సమాచారం ఇస్తూ వారు సమావేశంలో పాల్గొనడం కూడా కుట్రలు చేస్తున్నట్లు సీనియర్ల అనుచరులు చెవులు కొర్రుకుంటున్నారు.

అధికార పార్టీపై విమర్శలు చేయకుండా బీఆర్​ఎస్​నేతలపై ఆరోపణలు చేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని, ఒక వర్గం కాంగ్రెస్​పై బాణాలు ఎక్కు పెట్టగా, మరో వర్గం ప్రతిపక్ష గులాబీ పార్టీ పై పెట్టిందని, పార్టీలో సీనియర్ల మధ్య సఖ్యత లేదనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. నాలుగైదు సంవత్సరాల కితం పార్టీలోకి వచ్చి ప్రజాప్రతినిధులుగా అయిన వారిని కీలకమైన విషయాల్లో సంప్రదించడం లేదని, పాత నాయకులే పార్టీ తమ చేతుల్లో ఉండాలని, వలస నాయకుల చేతుల్లో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు పార్టీ కార్యాలయంలో తిష్టవేసి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు గౌరవం ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన పార్టీ వర్క్​షాపు కు ఆశించిన స్ధాయిలో నేతలు రాకుండా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీలు ఈటెల రాజేందర్, డి. కె. అరుణ, ఆర్. కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్​రెడ్డి, రఘనందన్​రావు మాత్రమై హాజరైయ్యారు. కీలక నేతలైన శాసన సభ పక్షనేతలు ఎవరు రాలేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా 11 మంది ఉంటే అందులో నలుగురే హాజరైయ్యారు. ఎంపీలైన లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, గోడం నగేష్, బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి, పాయల శంకర్​వారి నియోజకవర్గాల్లో పర్యటించారు. కీలక నేతలంతా సమావేశానికి దూరంగా ఉంటే మోడీ 11 పాలనపై ప్రజలకు ఏవిధంగా వివరిస్తారని, ఈనెల 25వరకు చేపట్టే కార్యక్రమాలు పరిస్థితి ఏమిటని ద్వితీయ శ్రేణలు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నివ్వడం మాత్రమే కానీ వాటి అమలుపై పట్టించుకునే నాథుడే లేదని జిల్లా అధ్య క్షులు వాపోతున్నారు. పార్టీలో చెప్పే వారే తప్ప చేయించువారే మచ్చుకు లేరని పేర్కొంటున్నారు.

అధ్యక్షుని ఎంపికపై తలోదారి : ఈసారి పార్టీ అధ్యక్ష పదవి బీసీలకే కట్టబెట్టాలని కిందిస్ధాయి నేతలు కోరుతున్నారు. పలు పర్యాలు ఒకే సామాజిక వర్గం నేతలకే ఇస్తున్నారని ఈసారి బలహీనవర్గాలకు అప్పగించి అధికార కాంగ్రెస్​, బీఆర్​ఎస్​లను ఇరుకులో పెట్టాలని కొందరు నేతలు హైకమాండ్ కోరుతున్నట్లు తెలిసింది. మరోక వర్గం తెలంగాణలో బీసీ వాదం పనిచేయదని, వారికి అసెంబ్లీ సీట్ల పంపిణీలో అవకాశం ఇవ్వాలని, పార్టీ పగ్గాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ పెద్దల ముందు వాదన వినిపించినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. వర్గ పోరుతో జాతీయ నాయకత్వం కొన్ని రోజులు పెండింగ్​లో పెట్టి పరిస్ధితులు సర్దుబాటు అయ్యాక ప్రకటన చేద్దామని దోరణిలో ఉన్నట్లు ఎమ్మెల్యేలు వెల్లడించారు. నలుగురు నాయకులు కలిస్తే ఎప్పడు అధ్య క్షుడి ప్రకటన అనే విషయంపై చర్చ జరుగుతోంది. అధ్యక్షుడు ఎంపికైతే గ్రూపులకు చెక్​పడుతుందని, అందరు కలిసిపోక తప్పదని ఎంపీలు అంతర్గత సంభాషణలో వెల్లడించారు.

Next Story