ప్రజల్లోకి ''బడ్జెట్''.. ప్రతి గడపకు రీచ్ అయ్యేలా దేశవ్యాప్తంగా BJP స్పెషల్ డ్రైవ్!

by Disha Web Desk 19 |
ప్రజల్లోకి బడ్జెట్.. ప్రతి గడపకు రీచ్ అయ్యేలా దేశవ్యాప్తంగా BJP స్పెషల్ డ్రైవ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం ప్రవేశ పెట్టిన 2023 బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై బీజేపీ దృష్టిసారిస్తోంది. ప్రతిపక్షాల నోళ్లు సైతం మూయించేలా బడ్జెట్ ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఈ బడ్జెట్ గురించి తెలియజేయాలని కాషాయ పార్టీ డిసైడ్ అయింది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలు ఉన్న 9 రాష్ట్రాల్లో ఈ బడ్జెట్‌పై ప్రజలకు వివరించాలాని చూస్తున్నట్లు సమాచారం. దీనికోసం ప్రత్యేక కార్యాచరణను సైతం పార్టీ రూపొందించుకుంది. తెలంగాణలో ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రజలకు బడ్జెట్‌పై వివరించి, అవగాహన కల్పించాలని హైకమాండ్ ఆదేశించింది. దీనికి కేంద్రంతో పాటు, రాష్ట్ర, జిల్లా స్థాయిలోనూ కమిటీలు ఏర్పాటు చేసింది. ప్రజలు బీజేపీకి ఆకర్షితులయ్యేలా చూడాలని నేతలకు జాతీయ పెద్దలు దిశానిర్దేశం చేశారు.

దేశవ్యాప్తంగా ఈనెల 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. కాగా తెలంగాణలో 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కనీసం వారం పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని హైకమాండ్ నేతలను ఆదేశించింది. బడ్జెట్‌లోని నిబంధనలు, వాటి విస్తృత ప్రభావాలను ప్రజలకు సులువుగా అర్థమయ్యే భాషలో తెలియజేయాలని స్పష్టం చేసింది. కాగా దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ స్పెషల్ డ్రైవ్‌కు కేంద్ర మంత్రులు, జాతీయ పదాధికారులు ప్రధాన నగరాలను సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా తెలంగాణకు సైతం జాతీయ నేతలు వచ్చే అవకాశముంది. రాష్ట్ర పదాధికారులు, ప్రజా ప్రతినిధులు, సబ్జెక్ట్ నిపుణులు జిల్లాలు, ప్రధాన కాలేజీలకు వెళ్లి, ఇంటరాక్షన్ సెషన్లు కూడా నిర్వహించి వారికి అర్థమయ్యేలా చూడాలని స్పష్టంచేసింది.

ఈ డ్రైవ్ నిర్వహణకు తెలంగాణలో నలుగురితో ప్రత్యేక కమిటీని పార్టీ ఏర్పాటుచేసింది. సెంట్రల్ కమిటీలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఉన్నారు. రాష్ట్ర కమిటీలో సీనియర్ నేతలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, పాల్వాయి రజని, సంగప్పను పార్టీ నియమించింది. కాగా జిల్లా స్థాయిలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించి ముందుకు సాగాలని పార్టీ స్పష్టంచేసింది. ప్రతి ఇంటికీ కరపత్రాలు సైతం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క రంగాన్ని విడిచిపెట్టకూడదని డిసైడ్ అయింది. యువత, వ్యాపారవేత్తలు, మహిళలు, రైతులు తదితర రంగాల వారీగా సమావేశాలు కూడా నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించింది.

ప్రజలకు వివరించేందుకు నిర్దిష్ట అంశాలను ఎంపికకు ప్రతి రాష్ట్రంలో ఆర్థిక నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేయాలని హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. సోషల్ మీడియా ద్వారా సైతం అంశాల వారీగా కంటెంట్‌తో ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలని పార్టీ నిర్దేశించింది. విద్యార్థులకు బడ్జెట్ గురించి తెలుసుకోవడంపై 'నో యువర్ బడ్జెట్' పేరుతో క్విజ్ పోటీలను నిర్వహించాలని హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. ఆయా రాష్ట్రాల వారీగా స్థానిక భాషల్లో బుక్ లెట్లను ప్రచురించి ప్రతీ ఇంటికీ పంపిణీచేసేలా యాక్టివిటీ రూపొందించుకోవాలని స్పష్టంచేసింది.

తెలంగాణలో బడ్జెట్‌పై అవగాహన కల్పించేందుకు పార్టీలోని ట్రేడర్స్ సెల్, డాక్టర్స్ సెల్, కిసాన్ మోర్చాలకు చెందిన నాయకులు ప్రత్యేక చొరవచూపేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో వివిధ వృత్తులవారితో సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నేతలకు దిశానిర్దేశం చేసింది. మార్కెట్ కేంద్రాలు, ట్రేడ్ సెంటర్లలో, డాక్టర్లు, ప్రభుత్వ పెన్షనర్లు, చార్టెడ్ అకౌంటెట్లు, బ్యాంకు ఉద్యోగులు, లాయర్లు, వ్యాపార సంఘాలు, రైతు నాయకులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. నేతలంతా ఫిబ్రవరి 3 నుంచి 10‌వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని నిర్దేశించారు.

Next Story

Most Viewed