BJP: అధికారం బీజేపీదే.. దానికి ఇదే నిదర్శనం.. జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
BJP: అధికారం బీజేపీదే.. దానికి ఇదే నిదర్శనం.. జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) అధికారంలోకి రావడం ఖాయమని, ఇందుకు లోక్ సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP Chief JP Nadda) అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై 6 అబద్దాలు.. 66 మోసాలు పేరుపై బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిథిగా హజరైన నడ్డా.. కాంగ్రెస్ పార్టీ(Congress Party)పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS Party) పార్టీలకు ఓట్ షేర్ చాలా తక్కువ వచ్చిందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని స్పష్టం చేశారు. కేంద్రంలో విపక్షాలన్ని ఏకమైనప్పటికీ మూడోసారి మోడీ(PM Modi)నే గెలిపించారని తెలిపారు. 70 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత అనే పదం వింటూ వచ్చాం కానీ మోడీ పాలనలో ఇంతవరకు ఆ మాట లేదని చెప్పారు.

అలాగే బీజేపీ 13 రాష్ట్రాల్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలో ఉందని, మరో 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉందని, మొత్తం 19 రాష్ట్రాల్లో బీజేపీదే అధికారమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్న జీవి అని, ఇతర పార్టీల బలహీనతలే కాంగ్రెస్ బలం అని విమర్శలు చేశారు. అంతేగాక బీజేపీతో నేరుగా పోటీలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎప్పుడూ ఓటమే.. ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కాంగ్రెస్ గెలుస్తూ ఉంటుందని రేవంత్(CM Revanth Reddy) గుర్తు పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ, హిమాచల్(Himachal Pradesh), కర్నాటక(Karnataka) రాష్ట్రాల్లో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. ఇక రేవంత్ ప్రభుత్వం ఏడాదిగా పేదలను మోసం చేస్తునే ఉందని, ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్న 12 వేలు ఏమయ్యాయని, రుణమాఫీ చేయకుండానే రైతులను మోసం చేశారని అన్నారు. తనపై తనకు భరోసా లేని రేవంత్ ప్రజలకు భరోసా ఎలా ఇస్తారని, ఒక్క రైతుకైనా రైతు భరోసా ఇచ్చారా? రైతు కూలీలకు సాయం ఏది అని ప్రశ్నించారు.

అలాగే మహిళలకు ఇస్తామన్న 2500 ఏమయ్యాయని, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్‌కి ఇస్తామన్న లక్ష, తులం బంగారం ఏమైందని నిలదీశారు. అంతేగాక బీసీ సబ్ ప్లాన్.. ఎంబీసీలకు శాఖ ఏవి అని, రైతు, మహిళ, యువత అందరికీ రేవంత్ ప్రభుత్వం వ్యతిరేకమేనని, రేవంత్ రెడ్డి కూడా మాయలఫకీర్ లా డ్రామాలు చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పులు చేయడంలో రేవంత్ రికార్డ్ సృష్టిస్తున్నారని, అప్పులు చేసి పాలించడమే రేవంత్ కు తెలిసిన పని అని, ఆ అప్పులే చివరికి తెలంగాణ ప్రజలను మోసం చేయబోతున్నాయని హెచ్చరించారు. కాంగ్రెస్ ఒక్కసారి ఓడితే తిరిగి అధికారంలోకి రాలేదని, తెలంగాణలో కూడా ఇదే జరగబోతోందని, బీహార్, యూపీలో కాంగ్రెస్ గెలిచి 30 ఏళ్లకు పైనే అయ్యిందని తెలియజేశారు. తెలంగాణ కోసం మోడీ అనేక అభివృద్ది పథకాలు ప్రకటించారని, తెలంగాణ అభివృద్ది కోసం పన్నుల కింద లక్షా 60 వేల కోట్ల సాయం, మూడు వందేభారత్ రైళ్లు, హైవేల కింద ఐదు భారత్ మాల ప్రాజెక్టులు ఇచ్చామని నడ్డా తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed