- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా ఒకరిపై ఒకరు విమర్శలు : బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి, కమీషన్లకు పరిమితమైందని, గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ మున్సిపాలిటీల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి, కమీషన్లకు పరిమితమైందని, గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ మున్సిపాలిటీల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు ఆరోపించారు. డంపింగ్ యార్డులతో పట్టణాలు మురికి కూపాలుగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా, తిట్ల దండకాలు, తప్పుడు హామీలు, కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు అడిగారు. ప్రజలు హామీల అమలు గురించి ప్రశ్నిస్తే, ప్రతిపక్షాలపై బూతుల వర్షం కురిపిస్తున్నారు. ఇదేనా హార్వర్డ్ యూనివర్సిటీలో నేర్చుకుని వచ్చిన లీడర్‌షిప్ అని నిలదీశారు.
బీజేపీ స్పష్టమైన ఎజెండాతో ముందుకెళ్తోందని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి కీలక హామీలు, గెలిచాక చేపట్టబోయే అభివృద్ధి కార్యాచరణను స్పష్టంగా మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ చేసిన అవినీతి, అక్రమాలు, అమలు చేయని వాగ్దానాలను ప్రజలకు అర్థమయ్యేలా చార్జ్‌షీట్ రూపంలో విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని దోచిన కేసీఆర్‌ను చర్లపల్లి జైలుకు పంపుతామని పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. కాళేశ్వరం స్కామ్ సహా అన్ని అవినీతి కేసులకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నాయకులు దోచుకున్న అక్రమ సొమ్మంతా కక్కిస్తామని చెప్పారు.
కేసీఆర్‌కు చర్లపల్లి జైలులోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానని చెప్పిన ప్రగ్భలాలేనని తేలిపోయిందన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో బీఆర్ఎస్ అవినీతి కేసులకు సంబంధించిన కీలక ఫైళ్లు, డేటా, ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయని ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై ఒకరినొకరు కాపాడుకుంటూ ప్రజలను మరోసారి మోసం చేయడానికి కుట్రలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి అద్భుత స్పందన లభిస్తోంది. ఎక్కడికెళ్లినా ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రాన్ని సేవ్ చేసుకోవాలంటే బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు.






