ఈటల ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర.. డీజీపీకి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు

by Ramesh Naini |

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ పేరు ప్రతిష్టలను దెబ్బతీసేలా హైదరాబాద్‌ నగరంలో వెలసిన ఫ్లెక్సీలు, పోస్టర్లు తీవ్ర రాజకీయ కలకలం రేపుతున్నాయి.

ఈటల ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర.. డీజీపీకి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ పేరు ప్రతిష్టలను దెబ్బతీసేలా హైదరాబాద్‌ నగరంలో వెలసిన ఫ్లెక్సీలు, పోస్టర్లు తీవ్ర రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే కొందరు వ్యక్తులు కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో ఈటల రాజేందర్‌కు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అసత్య, వివాదాస్పద కంటెంట్‌తో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రచారానికి పాల్పడిన ఆకతాయిలను వెంటనే గుర్తించి, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు ఆదివారం రాష్ట్ర డీజీపీ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద వివాదాస్పద పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిసినట్లు తమ పార్టీ కార్యకర్తలు గుర్తించారని డాక్టర్ గౌతమ్ రావు తెలిపారు.

ఈటల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా..

స్వార్థ ప్రయోజనాలు ఆశించే కొందరు వ్యక్తులు ఎంపీ ఈటల రాజేందర్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేవలం ఈటల ప్రతిష్టనే కాకుండా.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రతిష్టను కూడా దిగజార్చాలన్నదే వారి ప్రధాన కుట్ర అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు, అభ్యంతరకర కంటెంట్‌తో కూడిన ఈ ఫ్లెక్సీల వెనుక చాలా స్పష్టమైన దురుద్దేశం దాగి ఉందని డాక్టర్ గౌతమ్ రావు పేర్కొన్నారు. బీజేపీ పార్టీ పట్ల ప్రజల్లో, నేతల్లో, అలాగే క్షేత్రస్థాయి కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి, గందరగోళం నెలకొందనే తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించడానికే ఈ కుట్రకు తెరలేపారని విమర్శించారు. తద్వారా రాష్ట్రంలో పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై డీజీపీ తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

పోస్టర్ల వెనుక అసలు సూత్రధారులు

ఈ పోస్టర్ల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. అభ్యంతరకర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై చట్టప్రకారం తగిన సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని కోరింది. ఫిర్యాదుతో పాటే.. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీలలో వెలసిన ఫ్లెక్సీలు, పోస్టర్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తక్షణ విచారణ నిమిత్తం డీజీపీకి అందజేసినట్లు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు స్పష్టం చేశారు.

Next Story