- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇలాగే ఉంటది: హుజురాబాద్ ఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ స్పందన
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తూ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత శౌర్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తూ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత శౌర్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా సంబురాలు నిర్వహించారు. బీజేపీ రిటైర్డ్ ఆర్మీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా లష్కర్, జైష్ వంటి ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడి ఉగ్రవాదులను మట్టుబెట్టిందన్నారు. ఈ విజయం దేశ భద్రత పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వ కఠిన వైఖరిని చాటిచెబుతున్నదని పేర్కొన్నారు. పహల్గాంలో సెలవుల కోసం వెళ్లిన అమాయక భారతీయ పర్యాటకులను మతం అడిగి కాల్చిచంపిన ఉగ్రవాదుల దారుణాన్ని దేశం ఎన్నటికీ మరువదని అన్నారు.
26 మంది భారతీయులను అత్యంత క్రూరంగా చంపిన పాక్ ప్రేరిత ఉగ్రవాదులకు, ఇది పాత భారతదేశం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని నూతన భారతదేశమని గుర్తుచేశారు. ఘటన జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే మహిళా అధికారుల పర్యవేక్షణలో భారత సైన్యం అత్యంత ఖచ్చితత్వంతో కేవలం 22 నిమిషాల్లో ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసిందని, ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడమే కాకుండా భారత వైపు నుంచి ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యిందని ఆయన వివరించారు. ఇటువంటి చారిత్రాత్మక విజయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తించిన తీరు అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్, చైనా ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యక్తిగత దూషణలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. వ్యక్తిగత పరువు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే బీజేపీ కార్యకర్తలు తగిన విధంగా స్పందించాల్సిన పరిస్థితులు వస్తుంటాయని అన్నారు.






