వాల్మీకి వర్గానికి కుల దృవపత్రాలు ఇవ్వకపోవడం దారుణం : బీజేపీ స్టేట్ చీఫ్​ రామ్‌చందర్​ రావు

by Ramesh Naini |

మహర్షి వాల్మీకి వారసత్వానికి సంబంధించిన వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, వెనుకబడిన తరగతులలో భాగంగా ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్​రావు ఆవేదన వ్యక్తం చేశారు.

వాల్మీకి వర్గానికి కుల దృవపత్రాలు ఇవ్వకపోవడం దారుణం : బీజేపీ స్టేట్ చీఫ్​ రామ్‌చందర్​ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహర్షి వాల్మీకి వారసత్వానికి సంబంధించిన వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, వెనుకబడిన తరగతులలో భాగంగా ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ రామ్‌చందర్ ​రావు (BJP state chief N. Ramchander Rao) ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సమాజానికి సత్యం, ధర్మం, న్యాయం, నైతికత మార్గాలను చూపిన మహర్షి వాల్మీకి బోధనలు అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. ఇటీవల గద్వాల్ ప్రాంతంలో బోయ వాల్మీకి సోదరులు తనను కలిసి ఎమ్మార్వో ఆఫీస్‌లో కనీసం కుల ధ్రువపత్రాలు కూడా ఇవ్వలేదని చెప్పారని తెలిపారు. మంగళవారం రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి వర్గానికి కుల దృవపత్రాలు ఇవ్వకపోవడం దారుణమని, ఇప్పటికైనా వాల్మీకి బోయల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి సారించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే బీసీలకు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటోంది... వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థలు విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. దాదాపు 6.70 లక్షల మంది విద్యార్థులు గురుకుల విద్యాలయాల్లో చదువుతున్నారని వారికి తినడానికి సరైన భోజనం లేదు, సురక్షితమైన భవనాలు నిర్మించ లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు, గురుకులాలు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించక పోవడంతో యజమానులు భవనాలకు తాళాలు వేస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు నాసిరకం భోజనం, కారణంగా ఆహార లోపంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల శిథిలావస్థకు చేరిన గురుకులాల భవనాలకు మరమ్మతులు చేపట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాల విద్యార్థుల కోసం గురుకులాల్లో అన్ని వసతులు కల్పించేందుకు తగిన నిధులు విడుదల చేసి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story