మున్సిపల్ ఫలితాలు బీజేపీ ఎదుగుదలకు నిదర్శనం: బీజేపీ స్టేట్ చీఫ్​ రాంచందర్​ రావు

by Ramesh Naini |

రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు తమ పార్టీ ఎదుగుదలకు స్పష్టమైన నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు హర్షం వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఫలితాలు బీజేపీ ఎదుగుదలకు నిదర్శనం: బీజేపీ స్టేట్ చీఫ్​ రాంచందర్​ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు తమ పార్టీ ఎదుగుదలకు స్పష్టమైన నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాల్లో చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ వంటి కీలక పదవులన్నింటిలో మంచి ఫలితాలను సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. నారాయణపేటలో చైర్ పర్సన్ పదవి సాధించిన పార్టీ నాయకులు ఎంతో కష్టపడి ఆ బాధ్యతను గెలుచుకున్నారని వెల్లడించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్-2026 రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, కార్యకర్తలందరూ కష్టపడి పార్టీకి అనుకూల వాతావరణాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్మించారని తెలిపారు. పార్టీ ఒక శక్తిగా ఎదుగుతోందన్న విశ్వాసాన్ని ప్రజల్లో బలంగా నాటారన్నారు. తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం అనే విశ్వాసాన్ని నిలబెట్టారని ప్రశంసించారు. ఈ విజయాలు కేవలం ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని నిర్మించడంలో మన కార్యకర్తలు సాధించిన విజయం అని కొనియాడారు.

ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ

బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని, దాదాపు 14 కోట్ల సభ్యత్వంతో పార్టీ విస్తృతమైన బలాన్ని సంపాదించిందన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి వరకు మన పార్టీలో ప్రతి ఎన్నిక, ప్రతి ప్రక్రియ పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరుగుతుందని, దేశమంతా దృష్టి సారించిన భైంసాలో ఇన్నాళ్లు ఇది మా గడ్డ అని చెప్పుకున్న వారి అహంకారాన్ని బద్దలు కొట్టి, కాషాయ జెండా ఎగరవేయడం చారిత్రాత్మక విజయం అని అన్నారు. ఇతర పార్టీలని కుటుంబ పార్టీలుగా ఉన్నాయని వారికి స్పష్టమైన సిద్ధాంతాలు ఉండవని, అధికారం సాధించడమే వారి ఏకైక లక్ష్యంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం తర్వాత భారతీయ జన సంఘ్‌గా ప్రారంభమైన ప్రయాణం, ఎన్నో అవరోధాలను దాటుతూ, త్యాగాలతో ముందుకు సాగిందన్నారు. 1980లో భారతీయ జనతా పార్టీగా ఏర్పడిన తర్వాత కూడా, కేరళ వంటి రాష్ట్రాల్లో మన స్థితి అత్యంత కఠినంగా ఉండేది.. ఆ కాలంలో కమ్యూనిస్టులు పాలించిన కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు జరిగినా కూడా, పార్టీ తన సిద్ధాంతాన్ని, దేశభక్తిని ఎప్పటికీ వదల్లేదని, అలాంటి త్యాగాల పునాదిపైనే నేడు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచిందన్నారు.

ప్రతి కార్యకర్తను సిద్ధాంత పరంగా దృఢంగా తయారు చేయడం, రాబోయే ఎన్నికలకు సంస్థాగతంగా సిద్ధం కావడం, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువెళ్లడమే ఈ శిక్షణ మహాభియాన్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతం రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు అమర్ నాథ్ సారంగుల, రాష్ట్ర పదాధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Next Story