- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది.. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఆరోపణలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతూ అవమానిస్తున్నారని, ఓటు చోరీ అంటూ తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతూ అవమానిస్తున్నారని, ఓటు చోరీ అంటూ తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సూచించారు. దేశంలో జరిగింది ఓటు చోరీ కాదు, ఆయనకు మెదడు చోరీ అయిందని ఎద్దేవా చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు, అవహేళన చేసేందుకు గతంలో కాంగ్రెస్ పాలకులు అనేక ప్రయత్నాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం మనకు హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలను కూడా ఇచ్చిందన్నారు.
నెహ్రూ రాజ్యాంగాన్ని అవహేళన చేశారు..
ప్రభుత్వాలు ఎలా నడవాలి, ప్రజాస్వామ్యం ఎలా కొనసాగాలి అనే దిశ, దశ ఈ రాజ్యాంగమే నిర్దేశించింది.. నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని అవహేళన చేశారని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. అదే బాటలో ఇందిరా గాంధీ కూడా రాజ్యాంగాన్ని కాలరాయడానికి ప్రయత్నించారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా రాజ్యాంగాన్ని గౌరవించలేదు. షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, యూనిఫాం సివిల్ కోడ్ అవసరాన్ని న్యాయస్థానం గుర్తు చేసింది. అయినప్పటికీ, కొంతమందిని బుజ్జగించే రాజకీయాల కోసం ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకువచ్చి, సుప్రీంకోర్టు తీర్పు ప్రభావాన్ని నిర్వీర్యం చేసి న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు.
ఉపాధి కల్పన పేరుతో కోట్లలో అవినీతి..
ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైన హక్కు. ఆ ఓటు హక్కు భారత పౌరులకే ఉండాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా విదేశాల నుంచి మన దేశంలోకి చొరబడ్డ వారికి, స్థానిక రాజకీయ నాయకుల సహకారంతో ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించి ఓటర్ల జాబితాల్లో చేర్చుతున్నారు. యూపీఏ పాలనలో పేదల కోసం ఉపాధి కల్పన పేరుతో అమలు చేసిన ఈ పథకంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది.. ఫేక్ జాబ్ కార్డులు, ఫేక్ వర్కులు, మట్టి తీసి మట్టి వేసే పనులతో లెక్కల కందని భారీ కుంభకోణాలు కాంగ్రెస్ పాల్పడిందన్నారు. గత ఎన్నికల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను మార్ఫింగ్ చేసి, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ దుష్ప్రచారం చేశారు.. ఈ మార్ఫింగ్ వీడియోల కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తుంది.. అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం 2019లో అధికరణ 370 రద్దు చేసి జమ్మూ–కాశ్మీర్‌ను పూర్తిగా భారత రాజ్యాంగ పరిధిలోకి తీసుకొచ్చింది.. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్, ముస్లిం లీగ్, మావోయిస్టులతో కలిసి నడుస్తోంది. దేశంలో మావోయిస్టులను అంతం చేస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ఇస్తోంది. ఒకప్పుడు దేశాన్ని విడగొడతామని చెప్పిన జమాతే ఇస్లామీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది.. హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీతో కలిసి అభివృద్ధిని కాలరాసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే అదే మజ్లిస్‌తో కలిసి రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.






