గాంధీ సరోవర్​ పేరుతో 450 మంది పేదల ఇండ్లు ఖాళీ చేసే కుట్ర : బీజేపీ స్టేట్ చీఫ్ ​ఆరోపణలు

by Ramesh Naini |

గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో సుమారు 450 మంది పేద కుటుంబాలను ఖాళీ చేయించి, తరలించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

గాంధీ సరోవర్​ పేరుతో 450 మంది పేదల ఇండ్లు ఖాళీ చేసే కుట్ర : బీజేపీ స్టేట్ చీఫ్ ​ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహా నగరంలో హైడా పేరుతో పేదలపై కాంగ్రెస్ సర్కారు కొనసాగిస్తున్న దాడిని చరిత్ర ఎప్పటికీ మరచిపోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు పేర్కొన్నారు. ఇప్పటికే వేలాది పేద కుటుంబాలు వేధింపులు, నిర్బంధాలకు గురయ్యాయని ఆరోపించారు. తాజాగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో సుమారు 450 మంది పేద కుటుంబాలను ఖాళీ చేయించి, తరలించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సోమవారం ఎక్స్ వేదిక స్పందిస్తూ, అభివృద్ధి పేరుతో పేదల జీవితాలను అంధకారంలోకి నెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసం కాదు.. ఏ ప్రాజెక్ట్ అయినా, ఎంత ప్రతిష్టాత్మకమైనదైనా చట్టబద్ధమైన విధానాలు, గౌరవప్రదమైన పునరావాసం, పూర్తి పారదర్శకత తప్పనిసరిగా కల్పించాలని అన్నారు. తగిన భద్రత లేకుండా, బలవంతంగా పేదలను ఖాళీ చేయించడం మానవత్వానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రభావిత ప్రతి కుటుంబం పక్షాన తాము దృఢంగా నిలుస్తాం. ప్రతి కుటుంబానికి న్యాయం, పారదర్శకత, సముచిత పునరావాసం కల్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు.

మోడీ విజయాలు జీర్ణించులేక..

అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ సందర్భంగా కాంగ్రెస్ యూత్ నాయకులు చేపట్టిన అర్ధనగ్న నిరసన దేశ గౌరవాన్ని, భారత ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై తీవ్రంగా అవమానించిందని బీజేపీ మహిళా మోర్చా ఖండించింది. ప్రపంచ దేశాల ప్రముఖులు, టెక్నాలజీ రంగ దిగ్గజాలు హాజరైన వేదికపై షర్ట్‌లు విప్పి కావాలనే గందరగోళం సృష్టించడం దేశ ప్రతిష్ట పై దాడి చేయడమేనని తప్పుబట్టింది. ప్రపంచం భారత్‌ను టెక్నాలజీ లీడర్‌గా, ఏఐ హబ్‌గా, నాలెడ్జ్ ఎకానమీగా గుర్తిస్తున్న సమయంలో ఈ విజయాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు దిగిందని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. మేకల శిల్పా రెడ్డి మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా, ఏఐ మిషన్లతో భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టే దిశగా ముందుకెళ్తుంటే, ఆ విజయాలను తట్టుకోలేకనే చిల్లర చేష్టలకు పాల్పడుతోందని విమర్శించారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశ గౌరవం, భారత సంస్కృతి, మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే కాంగ్రెస్ రాజకీయాలకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు.

Next Story