దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యం.. రూ.6 వేలకు పెన్షన్ పెంపుపై బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

దివ్యాంగుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ ​రావు విమర్శించారు.

దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యం.. రూ.6 వేలకు పెన్షన్ పెంపుపై బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : దివ్యాంగుల (Disabled) సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, రూ. 4 వేల నుంచి రూ. 6 వేలకు పెన్షన్ పెంపు చేస్తామని చెప్పి అమలు చేయకుండా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ ​రావు (Ramchander Rao) విమర్శించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దివ్యాంగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక ఉపకరణాల పంపిణీ, ప్రత్యేక ఉపాధి కోటా వంటి హామీలు గాలిలో కలిశాయని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు పొందేలా బీజేపీ కృషి చేస్తోందని భరోసా కల్పించారు. అదేవిధంగా మోడీ ప్రభుత్వం దివ్యాంగుల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేశారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, హియరింగ్ ఎయిడ్లు వంటి ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేస్తోందని అన్నారు. దివ్యాంగుల ఉపాధి అవకాశాల విస్తరణ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ అమలు చేస్తోందన్నారు. నేషనల్ హ్యాండికాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్​ద్వారా స్వయం ఉపాధికి రుణ సహాయం అందిస్తోందని వివరించారు. దివ్యాంగుల హక్కులను కాపాడగల పార్టీ బీజేపీ ఒక్కటేనని రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దివ్యాంగులు బీజేపీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెప్పే సమయం ఇదేనని పిలుపునిచ్చారు.

కొనుగోలు కేంద్రాలు తెరవక రైతులను ఇబ్బందుల్లోకి నెట్టి:

మోడీ ప్రభుత్వం రబీ సీజన్ కు ఫాస్ఫేటిక్ , పొటాషిక్ ఎరువులపై పోషక ఆధారిత సబ్సిడీ రేట్లను నిర్ధారించిన నిర్ణయం దేశవ్యాప్తంగా రైతులకు గొప్ప ఉపశమనం కలిగించే చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. కేంద్రం సుమారు రూ. 37,952.29 కోట్ల బడ్జెట్ కేటాయించడం ద్వారా మోడీ సర్కార్​రైతు పక్షపాతి, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించింది. ఈ నిర్ణయంతో డీ.ఏ.పీ, ఎన్‌పీకేఎస్ వంటి ఎరువులు రైతులకు సరసమైన ధరలకు సులభంగా లభిస్తాయి. రాబోయే రబీ సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం సమయానికి చర్యలు తీసుకోవడం ప్రశంసనీయం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని, వారి శ్రమకు గౌరవం చేకూరేలా, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేలా కృషి చేస్తోంది. కేంద్రం ప్రతి సీజన్‌లో రైతుల అవసరాలను ముందే అంచనా వేసి ఎరువుల సబ్సిడీని నిర్ణయిస్తూ పెంపొందిస్తూ వస్తుందన్నారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం బాధాకరం. పల్లెల్లో కోతలు జోరుగా సాగుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవక ఆలస్యం చేస్తుంది. రైతులు తమ ధాన్యం అమ్ముకోలేక, తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కేంద్రం రైతులకు సబ్సిడీ ఎరువులు అందించగా, రాష్ట్రం మాత్రం రైతుల పంట కొనకుండా వారిని కష్టాల్లోకి నెడుతోంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం. రైతుల శ్రేయస్సు, వ్యవసాయ అభివృద్ధి, వ్యవసాయ రంగంలో స్థిరత్వం మోడీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా కొనసాగుతుండగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతు ద్రోహి విధానాలతో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story