వందేమాతరం వివాదం: మజ్లిస్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ స్టేట్ చీఫ్ డిమాండ్

by Ramesh Naini |

దేశంలో ప్రధాని మోడీ సుపరిపాలన, అభివృద్ధి పట్ల ఆకర్షితులై తెలంగాణలో బీజేపీలోకి చేరికలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పేర్కొన్నారు.

వందేమాతరం వివాదం: మజ్లిస్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ స్టేట్ చీఫ్ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో ప్రధాని మోడీ సుపరిపాలన, అభివృద్ధి పట్ల ఆకర్షితులై తెలంగాణలో బీజేపీలోకి చేరికలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర కార్యాలయంలో ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాసంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరగా వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అద్భుత విజయం సాధించిందని, గతంలో 12 స్థానాలు ఉంటే, ఇప్పుడు 22 సీట్లను గెలుచుకోవడం పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనమన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బీహార్​ సీఎం నితీశ్ ​కుమార్ ​రాజ్యసభకు ఎన్నిక కావడం గర్వంగా ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలనే కాంగ్రెస్ డిమాండ్ విడ్డూరంగా ఉందని, అమెరికాకు చెందిన ఒక పక్షపాత సంస్థ రిపోర్టును పట్టుకుని కాంగ్రెస్ మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సంస్థ మన దేశ గూఢచారి సంస్థ 'రా' (RAW) ను కూడా బ్యాన్ చేయాలని సిఫారసు చేసిందని, ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయాలంటున్న కాంగ్రెస్ పార్టీ మన దేశ రక్షణ సంస్థ అయిన 'రా' ని కూడా రద్దు చేయమంటుందో జవాబు చెప్పాలని డిమాండ్​ చేశారు.

వందేమాతరాన్ని అవమానిస్తే కాంగ్రెస్ మౌనం!

లష్కరే తోయిబా కంటే హిందూ గ్రూపులే ప్రమాదకరమని ఆ రిపోర్ట్ చెబితే, కాంగ్రెస్ దాన్ని సమర్థిస్తుందని, అంటే కాంగ్రెస్ లష్కరే తోయిబాకు సపోర్ట్ చేస్తున్నట్లు ఉందని తల తోక లేని మాటలు కాంగ్రెస్ ​మాట్లాడుతుందని మండిపడ్డారు. వందేమాతరాన్ని అవమానిస్తుంటే కాంగ్రెస్ మౌనం ఎందుకు వహిస్తుందని ప్రశ్నించారు. గీతాలాపన చేస్తుంటే మజ్లిస్​ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.. దీనిపై కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదని ఫైర్ అయ్యారు. వందేమాతరం అనేది దేశ స్వాతంత్ర పోరాట ఊపిరి దానిని అవమానిస్తే కాంగ్రెస్‌కు నోరు రాదా? అని నిలదీశారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం పై అవగాహన ఉందా..?, ఆయన ఎప్పుడూ రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతారు.. ఆయన ఒక్కసారి ఆర్టికల్ 51 ఏ చదవాలి.. రాజ్యాంగబద్ధమైన విధులను విస్మరించి, దేశ వ్యతిరేక శక్తులకు వత్తాసు పలకడం సిగ్గుచేటు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని, అది రాజ్యాంగబద్ధమైన కర్తవ్యమన్నారు.

Next Story