బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్నిక.. కేడర్‌లో జోష్ నిల్

by Kema Shiva Kumar |

బీజేపీలో కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీ కేడర్‌ను తీవ్ర నిరాశ, నిస్తృహకు గురిచేసినట్లు తెలుస్తోంది.

బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్నిక.. కేడర్‌లో జోష్ నిల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీలో కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీ కేడర్‌ను తీవ్ర నిరాశ, నిస్తృహకు గురిచేసినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు కొత్త అధ్యక్షుడి నియామకంపై పెదవి విరుస్తున్నట్లు సమాచారం. వ్యక్తిగతంగా రామచందర్ రావు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. కానీ, ఆయన నేతృత్వంలో పార్టీ అధికారంలోకి రావడం కష్టం అని అభిప్రాయపడుతున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే శక్తియుక్తులు ఉన్న లీడర్లను పక్కన పెట్టి మృదు స్వభావిగా పేరున్న రామచందర్ రావుకు బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటీ?అని చర్చించుకుంటున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కట్టడి కష్టమే!

రాష్ట్రంలో కొన్ని నెలలుగా బీజేపీ ఉనికి లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. చాలా విషయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే తీరుగా రాజకీయాలు నడిచాయి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అనుకున్న స్థాయిలో పార్టీ కార్యక్రమాలు లేవని ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటికీ ఆ పార్టీ లీడర్లు స్పందిస్తూ ‘ కొత్త అధ్యక్షుడు వస్తాడు, అప్పుడు చూపిస్తాం మా సత్తా ఎంటో’ అని సమాధానం ఇచ్చేవారు. కానీ, కొత్త అధ్యక్షుడి నియామకంపై కేడర్, లీడర్లు షాక్‌కు గురయ్యారు. రామచందర్ రావు‌ను వ్యక్తిగతంగా ప్రశంసిస్తూనే ఆయన నాయకత్వంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎదుర్కోవడం కష్టమని తమ ఇంటర్నల్ మీటింగ్‌లో అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ‘మాటకు మాట, విమర్శకు ప్రతి విమర్శ, సై అంటే సై అని సవాలు విసిరే వ్యక్తిత్వం ఉన్న లీడర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుండేది’ అని మాట్లాడుకుంటున్నారు. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు దీటుగా సమాధానం చెప్పడం వల్లే పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు గెలిచారని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి సన్నివేశాలు బీజేపీ పార్టీలో జరుగుతాయా?అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రామచందర్ నేతృత్వంలోనే అసెంబ్లీ పోల్స్?

బీజేపీలో అధ్యక్షుడి పదవీ కాలం 3 ఏళ్లు. కొత్త అధ్యక్షుడు రామచందర్ రావు పూర్తి కాలం కొనసాగుతారా? లేక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ పగ్గాలను మరో లీడర్‌కు అప్పగిస్తారా? అనే చర్చ జరుగుతున్నది. ఎందుకంటే 2027లోనే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతున్నది. అంటే అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లలో జరిగే అవకాశం ఉంది. దీనితో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రామచందర్ రావే పార్టీ చీఫ్‌గా ఉంటారేమోనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఎన్నికలకు 6 నెలల ముందు పార్టీ అధ్యక్షుడిని మార్చి, మరో లీడర్‌కు బాధ్యతలు అప్పగిస్తే అంత తక్కువ సమయంలో పార్టీని అధికార పీఠం వైపు నడిపించడం అంత సులువు కాదని కామెంట్స్ ఉన్నాయి. అయితే, అధ్యక్ష ఎంపిక విషయంలో జాతీయ పార్టీ అన్ని కోణాల్లో ఒకటికి రెండు సార్లు అలోచించే నిర్ణయం తీసుకుంటుదని సీనియర్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు.

స్థానిక ఎన్నికలు పెద్ద సవాలు

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో చాలా గ్రామాల్లో కమలం పార్టీకి పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ఉంది. మిగతా జిల్లాల్లోని చాలా అర్బన్ ఏరియాల్లో బీజేపీ పట్ల యువత అట్రాక్ట్ అవుతున్నారు. దీనితో కొత్త అధ్యక్షుడు నేతృత్వంలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గెలుస్తామని ఆశపడ్డారు. తీరా అధ్యక్షుడి నియామకాన్ని ప్రకటించిన తరువాత కేడర్‌లో ఉత్సాహం అనే మాట అటుంచి, నిరాశ నిండుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో గతంలో కంటే తక్కువ స్థానాలు వస్తాయేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో స్థానాలు సాధిస్తే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుంది. కానీ, కొత్త అధ్యక్షుడిగా రామచందర్ రావు పనితీరుకు, పార్టీ భవిష్యత్‌కు త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికలు ఓ పరీక్షగా నిలుస్తాయనే చర్చ జరుగుతున్నది.

Next Story