కేసీఆర్ కొడుక్కు నోటీసులు జారీ చేసే దమ్ము సిట్‌కు ఉందా?

by Disha Web Desk 2 |
కేసీఆర్ కొడుక్కు నోటీసులు జారీ చేసే దమ్ము సిట్‌కు ఉందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రతిపక్షాలకు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ప్రతిపక్షాల నేతలకు నోటిసులిస్తున్న సిట్‌కు తన పేరును ప్రస్తావించిన కేసీఆర్ కొడుక్కి నోటీసులిచ్చే దమ్ముందా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. నోటీసుల పేరుతో ప్రతిపక్షాలను, దాడులు, నిషేధం పేరుతో మీడియా సంస్థల నోరు నొక్కే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. కుట్రకు కారకులైన వారిని వదిలేసి ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని బండి విమర్శించారు. సిట్ నోటీసులకు, విచారణకు భయపడే ప్రసక్తే లేదన్నారు. గతంలో ఇదే పంథాతో రెచ్చిపోయిన హిట్లర్, ఇందిరాగాంధీ లాంటి నియంతలనే మట్టికరిపించిన చరిత్ర ప్రజలకుందన్నారు. కేసీఆర్ సర్కార్‌కు సైతం అదే గతి పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని సూచించారు.

ఆధారాలు సమర్పించాలని కోరేందుకే సిట్ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారని, అదే నిజమైతే, సిట్ కు నిబద్ధత ఉంటే పేపర్ లీకేజీ కుట్ర వెనుక బండి సంజయ్ పాత్ర ఉన్నట్లు కేసీఆర్ కొడుకు తనపై ఆరోపణలు చేశాడని, ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని కేసీఆర్ కొడుక్కు నోటీసులు జారీ చేసే దమ్ము సిట్‌కు ఉందా? ఆయనను పిలిచి విచారించే ధైర్యముందా? అని బండి ప్రశ్నించారు. సిట్ కేసీఆర్ జేబు సంస్థగా మారిందని, గతంలో డ్రగ్స్, నయీం డైరీ, మియాపూర్ భూములపై సిట్ జరిపిన విచారణలే ఇందుకు నిదర్శనమని చురకలంటించారు. ఆయా కేసులను నీరుగార్చడంతోపాటు కేసీఆర్‌కు ప్రయోజనం చేకూర్చేలా సిట్ పనిచేసిందని ఆరోపించారు.

వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి దోషులను కఠినంగా శిక్షిస్తుందనే నమ్మకాన్ని సిట్ ఎప్పుడో కోల్పోయిందని పేర్కొన్నారు. తప్పు చేసినోళ్లు ఎవరైనా సరే, చివరకు తన కొడుకు, బిడ్డ ఉన్నా ఉపేక్షించబోనని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డికి, ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడానికంటే ముందే ఆయన కొడుకు కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితేనే పేపర్ లీకేజీ కుట్రదారుల బండారం బయటపడే అవకాశముందని, అదే జరిగితే తన కొడుకు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి వెనుకంజ వేస్తున్నారని ఆరోపించారు. సిట్ విచారణ పేరుతో కిందిస్థాయి సిబ్బందిని ఇరికించి కేసును నీరుగార్చాలని చూస్తున్నారని, టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. కేసీఆర్ కొడుకు తప్పు చేయలేదని భావిస్తే తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, తమ వద్దనున్న సమాచారాన్ని సిట్టింగ్ జడ్జికి అందిస్తామని తెలిపారు.



Next Story

Most Viewed