తెలంగాణలో ప్రజల గొంతుకగా పనిచేయాలి.. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీజేపీ స్టేట్ చీఫ్

by Ramesh Naini |

దేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్యకర్తల నిస్వార్థ త్యాగం, అంకితభావంతో బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ ​రావు పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రజల గొంతుకగా పనిచేయాలి.. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీజేపీ స్టేట్ చీఫ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్యకర్తల నిస్వార్థ త్యాగం, అంకితభావంతో బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ ​రావు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతూ ఇది కేవలం సంబరాలు చేసుకునే రోజు మాత్రమే కాదని, దేశమే ప్రథమం అనే సిద్ధాంతం పట్ల నిబద్ధతను చాటుకునే గర్వకారణమైన రోజని అన్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సామాన్య కార్యకర్తలే బలగంగా, దేశ హితమే పరమావధిగా ప్రారంభమైన తమ పార్టీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు.

నాడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి మహనీయులు వేసిన పునాదులపై పార్టీ అప్రతిహతంగా దూసుకుపోతోందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల గొంతుకగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దృఢమైన, స్వయం సమృద్ధమైన వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ నాయకులు మురళీధర్ రావు, శాసన మండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story