- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా బిల్లుపై కాంగ్రెస్‌ది దొంగ నీతి: ఎంపీ లక్ష్మణ్ ఫైర్
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ విమర్శించారు. బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్రామ్విగ్రహం వద్ద మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే ఈ చారిత్రాత్మక బిల్లును కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. గత 30 ఏళ్లుగా ఏదో ఒక సాకుతో మహిళా బిల్లును అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. యూపీఏ హయాంలో సోనియా గాంధీ మహిళా చైర్ పర్సన్‌గా ఉన్నప్పటికీ, కూటమి పార్టీల పేరు చెప్పి వెనక్కి తగ్గారే తప్ప, మహిళా సాధికారతపై, మహిళా రిజర్వేషన్ల అమలుపై వారికి ఎప్పుడూ చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్లకు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రికి చట్టంపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. 2026 జనాభా లెక్కల తర్వాతే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని 2013లో చట్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్సీ, ఎస్టీ పార్లమెంట్ సీట్ల సంఖ్య 84 నుండి 105 వరకు పెరిగే అవకాశం ఉందని, అసెంబ్లీలో కూడా ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరుగుతాయి. దళితులు, గిరిజనులకు లభించే ఈ అధిక ప్రాతినిధ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. వారి ఎదుగుదలను కాంగ్రెస్ సహించలేకపోతోందన్నారు.
మహిళలు అసెంబ్లీ, పార్లమెంట్ మెట్లు ఎక్కడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదా..?
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి అనవసర భయాందోళనలు సృష్టిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత సీట్ల నిష్పత్తి తగ్గకుండానే సీట్లను పెంచుతామని ప్రధాని మోడీ ఇప్పటికే భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు 130 పార్లమెంటు సీట్లు ఉంటే దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతం. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా లోక్ సభ సీట్లు 816కు పెరిగితే దక్షిణాది రాష్ట్రాల సంఖ్య 195 అవుతుంది. అదే 24 శాతం నిష్పత్తి కొనసాగుతుంది. మహిళా బిల్లును అడ్డుకోవడానికి నీచ రాజకీయాలు చేయవద్దన్నారు. మహిళలు అసెంబ్లీ, పార్లమెంట్ మెట్లు ఎక్కడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదా, మహిళా శక్తిని తక్కువ అంచనా వేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి 33శాతం మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా అడుగులు పడుతున్నాయని, ఈ నెల 16 నుంచి18 తేదీల మధ్య జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ‘నారీ శక్తి వందన్ అధినియమ్’పై సమగ్ర చర్చ జరగనుందని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన పంథాను మార్చుకుని మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వాలని, లేకపోతే మహిళా లోకం ఆగ్రహానికి, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.






