'అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్‌కు స్క్రిప్ట్ రాసిచ్చింది వాళ్లే'

by Disha Web Desk 2 |
అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్‌కు స్క్రిప్ట్ రాసిచ్చింది వాళ్లే
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు వేరు వేరు కాదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.కే లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఈ రెండు పార్టీల నేతల తీరు చూస్తే అర్థం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ తండ్రీ కొడుకులు చదివారని, కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీని బీజేపీని విమర్శిస్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తున్నారని అన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. సెక్రటేరియట్‌కు రాని ముఖ్యమంత్రికి సెక్రటేరియట్ అవసరమా అని నిలదీశారు. శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ వేదికగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. తండ్రీ, కొడుకు, అల్లుడు పోటీపడి మరీ మోడీని, కేంద్రాన్ని విమర్శించారే తప్ప ప్రజల సమస్యలపై చర్చజరపలేదని విమర్శించారు.

అసెంబ్లీ సమావేశాలు అవు కథలా సాగిందని సభ వ్యవహారాలు పూర్తిగా పక్కదారి పట్టించారని దుయ్యబట్టారు. ఎక్కడ తమ గుట్టు రట్టు అవుతుందో అనే భయంతో కాగ్ రిపోర్ట్ ను కూడా సభలో పెట్టలేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో చర్చించే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. తెలంగాణ డిస్కంలను నష్టాల ఊబిలోకి దింపారని ఆరోపించారు. తెలంగాణ రోజు రోజుకు అప్పుల్లో పోటీ పడుతోందన్నారు. కేంద్ర మంత్రిగా గతంలో కేసీఆర్ ఎన్ని నిధులు రాష్ట్రానికి తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో పోరుగు దేశాలు ఆర్థికంగా చితికి పోతే భారత్ లో ఆర్థిక సంక్షోభం లేకుండా ప్రధాని మోడీ చేశారని చెప్పారు. బీసీల కోసం కేంద్రం పని చేస్తోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి: అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Next Story