‘ఎవ‌డ‌బ్బ సొమ్ము అనుకుంటున్నవ్’.. CM రేవంత్‌పై రెచ్చిపోయిన MLA

by Gantepaka Srikanth |

‘ఎవ‌డ‌బ్బ సొమ్ము అనుకుంటున్నవ్’.. CM రేవంత్‌పై రెచ్చిపోయిన MLA

‘ఎవ‌డ‌బ్బ సొమ్ము అనుకుంటున్నవ్’.. CM రేవంత్‌పై రెచ్చిపోయిన MLA
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవ‌డ‌బ్బ సొమ్మ‌ని సీఎం రేవంత్ రెడ్డి త‌న ఫుట్ బాల్ స‌ర‌దా కోసం రూ.వంద కోట్లు ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.. ఇది ముమ్మాటికీ ఆర్ధిక నేర‌మే అని మండిపడ్డారు. ప్రజాధనంతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌కుంటే ప్ర‌జ‌లు నిన్ను ఫుట్ బాల్ ఆడుకుంటారని ఫైర్ అయ్యారు. సీఎం ఫుట్ బాల్ స‌ర‌దా కోసం రూ.100 కోట్లకుపైగా ఖర్చు పెట్ట‌డం ప్ర‌జాధ‌నం దుర్వినియోగం కాదా? అని ప్రశ్నించారు. ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంలో మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడ‌డానికి ప్ర‌భుత్వం రూ.ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేస్తోందో, ఏ యో శాఖ‌ల నుంచి ఖ‌ర్చు చేస్తోందో, ఎందుకు ఖ‌ర్చు చేస్తోందో సీఎం వివ‌ర‌ణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ టీమ్‌ను సింగ‌రేణి స్పాన్స‌ర్ చేస్తోంద‌ని మీడియాలో చూశాను.. ఈ ఫుట్ బాల్ ఆట కోసం సింగ‌రేణి డ‌బ్బుల‌ను ఎంత ఖర్చు చేస్తున్నారు. ఎందుకు ఖ‌ర్చు చేస్తున్నారో కూడా చెప్పాల్సి వస్తుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇవే డ‌బ్బుల‌ను సింగ‌రేణిలో ఉన్న క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించ‌డానికి లేదంటే కార్మికుల సంక్షేమం కోసం ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు అని సూచించారు.

ప్ర‌భుత్వ శాఖ‌లేవైనా దుబారా ఖ‌ర్చులు చేస్తే ను క‌ట్ట‌డి చేయాల్సిన సీఎం, స్వ‌యంగా త‌న స‌ర‌దా కోసం దుబారా చేయ‌డం ఆర్ధిక నేర‌మే అని అన్నారు. మెస్సీ టీమ్‌తో రేవంత్ టీమ్ ఫుట్ బాల్ ఆడ‌డం వ‌ల్ల రాష్రానికి వ‌చ్చే ప్ర‌యోజ‌న‌మేంటో చెప్పాలని అడిగారు. అంత‌ర్జాతీయ ఫుట్ బాల్ దిగ్గ‌జం లియోనిల్‌ మెస్సీ ఒక ఎగ్జిబిష‌న్ మ్యాచ్ ఆడితే, అప్పీయ‌రెన్స్ ఫీజు కింద రూ.70 కోట్లు తీసుకుంటార‌ని మీడియా చూసా.. మ‌రి మెస్సీకి ఇచ్చే అప్పీయ‌రెన్స్ ఫీజు ఏ ప్ర‌భుత్వ శాఖ ఇస్తోంది. దాని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌న‌మేంటి అని అడిగారు. మెస్సీకి ఇచ్చే మొత్తంతోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందికి వసతి, విమాన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తున్నది. అంతా కలిపి రూ.వంద కోట్లకుపైగా ప్రభుత్వం ఖ‌ర్చు చేస్తున్నదని అన్నారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో భాగంగానే ఈ ఫుట్ బాల్ ఎగ్జిబిష‌న్ మ్యాచ్ అని సిగ్గులేకుండా చెప్తున్న మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, శ్రీధ‌ర్ బాబు, ఈ ఫుట్ బాల్ మ్యాచ్‌తో తెలంగాణ ఎలా రైజింగ్ అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్లోబ‌ల్ స‌మ్మిట్ జ‌రిగింది డిసెంబ‌రు 8,9 తేదీల్లో. ఆ స‌మ్మిట్ ముగిసిన నాలుగు రోజుల‌కు ఈ ఫుట్ బాల్ మ్యాచ్ నిర్విహిస్తూ, ఈ మ్యాచ్ స‌మ్మిట్‌లో భాగ‌మ‌ని చెప్పేందుకు మంత్రుల‌కు సిగ్గుండాలి. అస‌లు గ్లోబ‌ల్ స‌మ్మిట్ ప్లానింగులో ఈ ఫుట్ బాల్ మ్యాచ్ లేనే లేదు. అస‌లు రేవంత్ స‌ర్కార్ రెండేళ్లు పూర్తి చేసుకున్న విష‌యం ఈ ఫుట్ బాల్ ప్లేయ‌ర్ మెస్సీకి తెలుసా? అని ప్రశ్నించారు.

కేర‌ళ ప్ర‌భుత్వం ఫుట్ బాల్ ఎగ్జిబిష‌న్ మ్యాచ్ నిర్వ‌హించ‌డం త‌మ వ‌ల్ల కాద‌ని నిరాక‌రిస్తే, మెస్సీ ఇండియా టూర్‌ను ప్లాన్ చేసిన ఈవెంట్ ఆర్గ‌నైజేష‌న్ సీఎం రేవంత్ రెడ్డిని ముంబైలో క‌లిసి తెలంగాణ‌లో నిర్వ‌హించాల‌ని కోరారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మ‌న‌వ‌రాలి పెళ్లి కోసం సీఎం రేవంత్ రెడ్డి అక్టోబ‌రు 31న ముంబై వెళ్లిన‌పుడు అక్క‌డ ఫుట్ బాల్ మ్యాచ్ ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్లు క‌లిశారు. అంటే హైదరాబాద్‌లో ఫుట్ బాల్ మ్యాచ్ పెట్టాల‌నేది నెల రోజుల క్రితం డిసైడ్ అయింది. కానీ గ్లోబ‌ల్ స‌మ్మిట్ మూడు నెల‌ల క్రితం డిసైండ్ అయింది. మ‌రి వాస్త‌వాలు ఇలా ఉంటే సీఎం, మంతులు గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో భాగంగా ఫుట్ బాల్ మ్యాచ్ అన‌డం సిగ్గుచేటు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రేపు హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.

Next Story