- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎరువుల పంపిణీపై బీజేపీ నేతల వ్యాఖ్యలు అర్థరహితం: మంత్రి తుమ్మల
తమ ప్రభుత్వం ఖరీఫ్ కోసం కేటాయించిన ఎరువులు గురించి అడుగుతుంటే బీజేపీ నేతలు అరిగిపోయిన గ్రామ ఫోన్ లాగా పదే పదే యాసంగి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తమ ప్రభుత్వం ఖరీఫ్ కోసం కేటాయించిన ఎరువులు గురించి అడుగుతుంటే బీజేపీ నేతలు అరిగిపోయిన గ్రామ ఫోన్ లాగా పదే పదే యాసంగి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ 2024-25 యాసంగికి సంబంధించిన మిగులు యూరియా 1.92 మెట్రిక్ లక్షల టన్నులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండటంతో కేంద్రం ఈ ఖరీఫ్ లో కేటాయింపులు సక్రమంగా చేయకపోవడంతో అధికారులు ఇప్పటివరకు సర్ధుబాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిలో ఉంటూ, ఇలాంటి అర్థరహిత మాటలు మాట్లాడటం సరికాదని లెక్కలు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలని ఎవరో రాస్తే మాట్లాడొద్దని హితవు పలికారు. అధ్యక్ష పదవిపై వారి పార్టీ నాయకులకు చాలా మందికి కోరిక ఉందని, వారు ఆయనతో ఇలాంటి మాటలు మాట్లాడించి రాజీనామా చేయించేందుకు కుట్రలు చేస్తున్నట్లు అర్ధమైతుందన్నారు. తాను మాత్రం రాంచందర్‌రావు అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఎవరి మాటలు వినకుండా నిజాలు తెలుసుకోవాలని సూచించారు.
ఖరీఫ్‌లో యూరియా వినియోగం 10.48 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కోసం 11.50 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అడిగిందన్నారు. రాష్ట్రంలో యాసంగికి సంబంధించిన మిగులు యూరియా 1.92 మెట్రిక్ లక్షల టన్నులు ఉండటంతో 9.80 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించిందన్నారు. ఇందులో జులై నెల వరకు కేటాయించింది 6.60 లక్షల మెట్రిక్ టన్నులు. ఇంకా యూరియా లోటు 2.24 లక్షల మెట్రిక్ టన్నులు ఉందన్నారు. తాను చెప్పిన లెక్కల్లో అనుమానాలు ఉంటే కేంద్రం దగ్గర సరఫరా చేసిన లెక్కలను తెప్పించుకొని మరోసారి సరిచూసుకొని, రాజీనామా లాంటి సవాళ్లు చేస్తే బాగుండేదన్నారు. ఇంతకు ముందు 12 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా జరిగేదని, ఇప్పుడేమో 9.80 లక్షల మెట్రిక్ టన్నులు అనడం హాస్యస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టి, నెల రోజులు కూడా కాకముందే అధ్యక్షుడిగా నిలదొక్కుకోవడానికి ఇలాంటి అర్థరహిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ రైతులు చీకొడుతారని పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగానికి అవసరమైన యూరియాను సకాలంలో తెప్పించడానికి ఆయన వంతు బాధ్యత తీసుకోవాలని సూచించారు.






