బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంది బీజేపీ నేతలే.. విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపీ (BJP) నేతలేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) తీవ్రంగా ఆరోపించారు.

బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంది బీజేపీ నేతలే.. విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపీ (BJP) నేతలేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) తీవ్రంగా ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పగటిపూట బీసీల గొంతు కోసిన బీజేపీ నాయకులు ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నది బీజేపీ నాయకులే, వీరు బీసీ ద్రోహులు, వెన్నుపోటు దారులని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. తాము పంపిన బిల్లులను ఆమోదించకుండా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుపడటం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించకుండా నోరు మూసుకున్న బీజేపీ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డిపై ఎగిరెగిరి పడుతుండటం హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ (Laxman)కు కనీసం సిగ్గు అనిపించడం లేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆయన కూడా సీఎంపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చి.. ఢిల్లీలో మాట మార్చింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. బీసీలకు తీరని అన్యాయం చేసింది బీజేపీనే అని అన్నారు. ఢిల్లీ (Delhi)లో బీసీ బిల్లులను ఆమోదించాలని రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు కాశాయని అన్నారు. బీజేపీ ద్రోహులను బీసీలు గమనించి సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. బీసీ బిడ్డ అని చెలామణి అవుతున్న లక్ష్మణ్.. ఆ బీసీలకే తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్.. బీసీ బిల్లు ఆమోదించాలని ప్రధాని మోదీ (PM Modi)పై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదన్నారు. తన పదవి పైన తప్ప బీసీలపైన ఇసుమంత ప్రేమ కూడా లక్ష్మణ్‌కు లేదన్నారు. గాంధీ కుటుంబం గురించి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. ప్రధాని పదవినే త్యాగం చేసిన చరిత్ర వాళ్లదని అన్నారు. ఎప్పటికైనా తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు సాధించేది కాంగ్రెస్ పార్టీనే అని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story