గో సంరక్షణ చట్టాలను కఠినతరం చేయాలి.. బీజేఎల్పీ నేత ఏలేటి డిమాండ్.. బాధితుడికి పరామర్శ

by Ramesh Naini |

హైదరాబాద్ లోని ఘట్కేసర్ వద్ద గో మాతని రక్షించినందుకు ఎంఐఎం గుండాలు సోను సింగ్ (ప్రశాంత్) పై క్రూరమైన దాడి చేశారని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

గో సంరక్షణ చట్టాలను కఠినతరం చేయాలి.. బీజేఎల్పీ నేత ఏలేటి డిమాండ్.. బాధితుడికి పరామర్శ
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని ఘట్కేసర్ వద్ద గో మాతని రక్షించినందుకు ఎంఐఎం గుండాలు సోను సింగ్ (ప్రశాంత్) పై క్రూరమైన దాడి చేశారని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆరోపించారు. గురువారం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో బాధితుడిని సహచర ఎమ్మెల్యేలతో కలిసి వెళ్ళి పరామర్శించారు. అనంతరం వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. (Cow protection laws) గో సంరక్షణ చట్టాలను కఠినతరం చేయాలని, వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరుసగా హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని అన్నారు. సంబంధిత హోం శాఖను ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని చోద్యం చూసినట్లు చూడటం సరికాదని తెలిపారు. మజ్లిస్ ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అసదుద్దీన్ ఓవైసీ కనుసన్నల్లో హోం శాఖను నడిపిస్తున్నారని మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాబోవు కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతి భద్రతలు కాపాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు రామారావు పటేల్, పాల్వాయి హరీశ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Next Story