తెలంగాణలో వెనుకబడ్డ బీజేపీ.. పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి!

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో కాషాయ పార్టీ అధ్యక్షుడి నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇదిగో అదిగో అంటూ కేడర్‌ను రాష్ట్ర అధినాయకత్వం మభ్యపెడుతూ వస్తున్నది.

తెలంగాణలో వెనుకబడ్డ బీజేపీ.. పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాషాయ పార్టీ అధ్యక్షుడి నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇదిగో అదిగో అంటూ కేడర్‌ను రాష్ట్ర అధినాయకత్వం మభ్యపెడుతూ వస్తున్నది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ముందుగా గత డిసెంబర్, ఆ తర్వాత ఈ ఏడాది సంక్రాంతి పండుగ వరకు స్టేట్ బీజేపీకి కొత్త చీఫ్ వస్తారని జోరుగా ప్రచారం జరిగినా కేంద్రంలోని బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టత రాలేదు. తాజాగా స్థానిక ఎన్నికల వరకు కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పార్టీకి పూర్తిస్థాయిలో అధ్యక్షుడు లేకపోవడం, ఇప్పుడున్న అధ్యక్షుడు అటు కేంద్రమంత్రిగా, ఇటు స్టేట్ చీఫ్‌గా రెండింటి బాధ్యతలు చూస్తుండటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన చాలా కార్యక్రమాలు నిలిచిపోయాయి. అందుకు పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకపోవడమే కారణమని కాషాయ శ్రేణులు భావిస్తున్నారు.

జిల్లా అధ్యక్షుల నియామకాలకు బ్రేక్..

రాష్ట్రంలోని బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాకపోవడంతో ఇప్పుడున్న మండలాలు, దాదాపు 30 శాతం జిల్లాల అధ్యక్షుల నియామక ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో చేసేదేమీ లేక ఏకాభిప్రాయ సాధన అంటూ స్టేడ్ లీడర్లు కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన జిల్లా అధ్యక్షులపైనా కేడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పార్టీ శ్రేణుల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, 20 నెలల నుంచి తాత్కాలిక చీఫ్‌గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. మరో 2 వారాల్లో నూతన అధ్యక్షుడు వస్తాడని ఆయనే ప్రకటించారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఇప్పట్లో జరగడం కష్టమని తెలుస్తున్నది. అధ్యక్షుడి ప్రకటనలో నిర్ణయం పలుమార్లు వాయిదా పడటం వెనక బీజేపీ అధిష్టానం బిజీగా ఉందా? ఏకాభిప్రాయం కుదరలేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధ్యక్షుడి ప్రకటన అనేది ప్రశ్నర్ధకంగానే మిలిగిందని పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు.

కిషన్‌రెడ్డికి రెండు పోస్టులు

2023 జూలై 4న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారు. బీజేపీలో సాధారణంగా ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన ఉంది. కానీ, 2023 మార్చి చివర్లో బండి సంజయ్​పదవీ కాలం ముగియడం, అనంతరం ఆయన్ను మరల కొనసాగించాలా? వేరే వ్యక్తులను నియమించాలా? అనే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పుడున్న 8 మంది ఎంపీల్లో ఇద్దరి పేర్లను అధిష్టానం సీరియస్‌గా పరిశీలించింది. కానీ, వారికి ఆర్ఎస్ఎస్​నుంచి క్లియరెన్స్ రాలేదని తెలిసింది. ఈ క్రమంలోనే ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుయని తెలిసి పార్టీ విదేయుడని భావించి కిషన్​రెడ్డికే తాత్కాలికంగా బీజేపీ స్టేట్ చీఫ్ పోస్టు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రానికి కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తాడని అప్పటివరకు వేచి చూడాలని ఆయన్ను బీజేపీ అధినాయకత్వం ఆదేశించింది. కానీ, అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసి వాటి ఫలితాలు వెలువడి 8 నెలలు కావొస్తున్నా పూర్తిస్థాయిలో స్టేట్ చీఫ్ నియామకం కాలేదు.

పూర్తికానీ కమిటీలు..

పార్టీ సభ్యత్వం, బూత్, గ్రామ కమిటీల ఏర్పాటు దాదాపుగా పూర్తయ్యింది. కానీ, మండల కమిటీలు ఇంకా పూర్తిస్థాయిలో వేయలేదు. అక్కడ సైతం ఏకాభిప్రాయం కుదరకపోవడం, వారిని కూర్చోబెట్టి మాట్లాడే నేతలు లేకపోవడం వల్లే కమిటీలు పూర్తి కాలేదు. ఒకవైపు ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్​కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడుతున్నది. ప్రతి అంశానికీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్రజలకు భరోసానిస్తూ బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు అవకాశం ఉన్నా.. అధిష్టానం అలా చేయడం లేదని లేదనే నిరుత్సాహంలో కమలం కేడర్ ఉన్నట్టు సమాచారం. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ.. కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజలకు విసుగొస్తే.. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే జనాల్లో వ్యతిరేకత పెరిగిందని చెప్పారు. కానీ, ప్రభుత్వ వైఫ్యల్యాలపై బీజేపీ కేడర్, పార్టీ నేతలు ఆందోళనలు, నిరసనలు, నిలదీతలు చేయడంలో ఎందుకు విఫలమయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

ఆధిప్యత పోరు

కిషన్ రెడ్డి ఓవైపు కేంద్రమంత్రిగా దేశం మొత్తం చూసుకోవాలి. మరోవైపు స్టేట్ చీఫ్ బాధ్యతలను చూసుకోవాలి. అందుకే పూర్తి స్థాయిలో పార్టీకి సమయం కేటాయించలేక పోతున్నారని తెలుస్తున్నది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను కొత్తగా వచ్చే అధ్యక్షుడు చూసుకుంటాడులే అన్న ధోరణి కూడా పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తున్నది. సంస్థాగతంగా రాష్ట్రాన్ని 38 జిల్లాలుగా విభజించారు. ఇందులో 23 జిల్లాలకు మాత్రమే జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. వీటి నియామకంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు.. గ్రూపులు, ఆధిపత్యం కారణంగా జాప్యం జరుగుతూ వస్తుంది. అందుకే ప్రస్తుతం నియామకమైన జిల్లా అధ్యక్షులకు వ్యతిరకంగా ధర్నాలు చేసే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్​నేతలు ఎవరికి వారు ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నారు. అయితే, కొత్త అధ్యక్షుడి నియామకం ఆలస్యం కావడంతో ఎవరికి వారు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. దీంతో సంస్థాగత వ్యవహరాలు ముగిసేవరకు పార్టీ పరంగా ఎటువంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దని నిర్ణయానికి వచ్చినట్లు కిషన్ రెడ్డి చెబుతున్నారు. కొత్త అధ్యక్షుడు వచ్చాక కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నారు.

Next Story