‘ఫసల్​బీమా’ అమలు చేసే వరకు పోరాటం ఆగదు.. బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్​

by Ramesh Naini |

రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం అమలు చేసి పంట నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్​ ​డిమాండ్​ చేశారు.

‘ఫసల్​బీమా’ అమలు చేసే వరకు పోరాటం ఆగదు.. బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం అమలు చేసి పంట నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్​ ​డిమాండ్​ చేశారు. ఈ ఏడాదిలో సాగు చేసిన పంటలో 30 శాతం మాత్రమే దిగుబడి వచ్చిందని దీంతో రైతులు నష్టపోయి అప్పల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయాలని కేంద్రం కోరితే పెడచెవిన పెట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్​ కూడా వారి దారిలో పోతూ రైతులను ఆదుకోవడంలో విఫలమైందని విరుచుక పడ్డారు. కంటితుడుపు చర్యగా బడ్జెట్​లో అంకెలు చూపిస్తూ అచరణలో పెట్టడం లేదని మండిపడ్డారు. పంట బీమా అమలు డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదిలాబాద్ కేంద్రంగా రైతులతో కలిసి ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి పంటల బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనున్నామని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న పంట నష్టాలకు తగిన న్యాయం జరగాలంటే బీమా పథకం అమలు అత్యవసరమని స్పష్టం చేశారు.

సేకరించిన 10 లక్షల దరఖాస్తులు..

ఈ నెల 16వ తేదీ రైతుల తరఫున సేకరించిన 10 లక్షల దరఖాస్తులతో శాసనసభ సమావేశానికి హాజరై, రైతుల గళాన్ని ప్రభుత్వానికి గట్టిగా వినిపిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ముఖ్య నేతలు రైతుల పక్షాన నిలబడి, ఉద్యమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని రైతులకు భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు. రైతుల హక్కుల సాధన కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆగదని కుండ బద్దలు కొట్టారు. ప్రకృతి సహకరించని సమయంలో బీమా రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, రాష్ట్రాలకు నిధుల కొరత ఉంటే కేంద్రం బీమా ద్వారా రైతులను ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. రేవంత్ ​సర్కార్ ​ఎన్నికల్లో రైతులకు అడ్డగోలుగా హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని, వారు అధికారం చేపట్టిన తర్వాత ఒక విడత మాత్రమే రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేశారని తెలిపారు. రుణమాఫీ విషయంలో చెప్పిన మాట తప్పిందని కొందరికే మాఫీ చేసి మరికొందరికి అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story