రాహుల్ గాంధీ అడగరు.. మోడీకి చిత్తశుద్ధి లేదు: మాజీ ఎంపీ వినోద్ కుమార్

by Malleboina Mahesh |   (  Updated:2025-07-30 16:35:23  IST  )

బీసీ బిల్లుపై రాహుల్ గాంధీ అడగరని.. ప్రధాని మోడీకి చిత్తశుద్ధి లేదని మాజీఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాహుల్ గాంధీ అడగరు.. మోడీకి చిత్తశుద్ధి లేదు: మాజీ ఎంపీ వినోద్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ బిల్లుపై రాహుల్ గాంధీ అడగరని.. ప్రధాని మోడీకి చిత్తశుద్ధి లేదని మాజీఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టవచ్చని.. ఇప్పుడు చర్చ జరుగుతుందని చెప్పారు. బీసీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిందని.. ఈ లోపే ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపి నిర్ణయం కోసం వేచి చూస్తున్నారని అన్నారు. సీఎం, మంత్రులు బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీ వెళ్లి ధర్నా చేయాలని నిర్ణయించారని.. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా? లేదా? అని అందరూ చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. ఒకే అంశం మీద బీసీ బిల్లు, ఆర్డినెన్స్ ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఎప్పుడూ ఆమోదానికి నోచుకోదని తమకు ముందే తెలుసన్నారు. కాంగ్రెస్, బీజేపీ బీసీలను మోసం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.

50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చకుండా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని పేర్కొన్నారు. మొదటి నుంచి తాము అదే వాదిస్తున్నామని.. బీఆర్ఎస్ బీసీ లీడర్లు కూడా అదే చెప్పారని స్పష్టం చేశారు. బీజేపీ కొత్త అధ్యక్షుడు రాంచందర్‌రావు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎంగా చేస్తామంటున్నారని.. బీసీలకు రిజర్వేషన్లు పెంచని వారు బీసీని సీఎం చేస్తారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం 243 డి కి సవరణ చేస్తే బీసీల రిజర్వేషన్లు పెంచవచ్చన్నారు. జీవో, ఆర్డినెన్స్‌ల ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని చెప్పారు. ధర్నాలు డ్రామాలు కాకుండా రాహుల్‌ను వెంట తీసుకుని రేవంత్ పీఎం దగ్గరకు వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్, లీగల్ సెల్ ప్రతినిధులు జక్కుల లక్ష్మణ్, సి.కళ్యాణ్‌రావు, హరీశ్‌, కావ్యశ్రీ పాల్గొన్నారు.

Next Story