అఫ్జల్‌గురును హీరోగా చిత్రీకరించడం దారుణం : బీజేపీ చీఫ్ ​రాంచందర్​రావు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

భారత రాజకీయాల్లో మేధావులు, విద్యావంతులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉందని, గతంలో రాజకీయాలు అంటే కేవలం డబ్బు ఉన్నవారో, అంగబలం, క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారో మాత్రమే వస్తారని భావించేవారని ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు పేర్కొన్నారు.

అఫ్జల్‌గురును హీరోగా చిత్రీకరించడం దారుణం : బీజేపీ చీఫ్ ​రాంచందర్​రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : భారత రాజకీయాల్లో మేధావులు, విద్యావంతులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉందని, గతంలో రాజకీయాలు అంటే కేవలం డబ్బు ఉన్నవారో, అంగబలం, క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారో మాత్రమే వస్తారని భావించేవారని ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు పేర్కొన్నారు. నేటి యువత - నెక్స్ట్ జనరేషన్, జన్జ్ - ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వానికి, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రముఖ డాక్టర్​ సాయిచంద్ ​పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్​ రావు మాట్లాడుతూ.. దేశాన్ని కాపాడగల నాయకుడు, దేశ సమస్యలను పరిష్కరించగల పార్టీ, దేశ ద్రోహ శక్తులు ఎందుకు పెరుగుతున్నాయి.. వాటిని ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్నలపై యువతలో స్పష్టమైన ఆలోచన పెరిగిందన్నారు.

అఫ్జల్‌గురును హీరోగా చిత్రీకరించడం దారుణం

ఇటీవల కొన్ని విశ్వవిద్యాలయాల్లో అఫ్జల్‌గురును హీరోగా చిత్రీకరించడం, దేశ న్యాయవ్యవస్థను అవమానించడం, జేఎన్‌యూ వంటి సంస్థల్లో కొంతమంది ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై అవహేళనకర వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆర్ఎస్ఎస్‌పై ద్వేషపూరితంగా మాట్లాడటం, దేశవిరోధ నినాదాలు వినిపించడం వంటి పరిణామాలను దేశం చూసిందన్నారు. దేశ విరోధి శక్తులను ఎదుర్కోవాలంటే దేశాన్ని ప్రేమించే, సమాజం పట్ల బాధ్యత కలిగిన చదువుకున్న వారు కూడా ఒక సంఘటిత శక్తిగా మారాల్సిన అవసరం ఉంది.. ఇటీవలి కాలంలో యువ నాయకులు, విద్యావంతులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పార్టీలో చేరుతూ దేశసేవలో భాగస్వాములు అవుతున్నారు. బీహార్‌లో అతి తక్కువ వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన యువ నాయకులు కూడా బీజేపీలో చేరడం రాజకీయాల్లోకి వస్తున్న నూతన తరానికి స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు ప్రజలకు విధానాలు చూపించలేక, బూతుల రాజకీయాలతోనే కాలం గడుపుతున్నాయి. ఒకరు ప్యాంట్ విప్పుతా అంటారు, మరొకరు తోలు తీస్తా అంటారు. ఈ రకమైన భాష, ఈ రకమైన రాజకీయాలు రాబోయే తరానికి తీవ్రంగా ప్రమాదకరంగా ఉందన్నారు.

మజ్లిస్ పార్టీని రాజకీయంగా అడ్డుకోవాలి

దేశాన్ని శక్తివంతంగా చేయాలంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, భారత్‌ను ఒక జాతీయ శక్తిగా నిలబెట్టాలంటే మేధావులు తమ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు, ఫిజియోథెరపిస్ట్‌లు, పారామెడికల్ రంగంలో పనిచేస్తున్న వారు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరడం ఎంతో శుభపరిణామంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరి సహకారంతో హైదరాబాద్‌లో బీజేపీ మేయర్‌ను గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. మజ్లిస్ పార్టీని రాజకీయంగా అడ్డుకోవాల్సిన మరింత ఉందన్నారు. దేశం ఎదుర్కొంటున్న ప్రమాదం మజ్లిస్​ కేవలం తెలంగాణ, హైదరాబాద్‌కో మాత్రమే పరిమితం కాదు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి తప్పకుండా మారుతుంది. కర్ణాటకలో కూడా బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుంది.. దేశం మొత్తం క్రమంగా కాషాయం వైపు సాగుతోందన్నారు. ఈ మార్పునకు నాంది పలకాల్సింది మేధావులేనని, తెలంగాణ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి , రంగా రెడ్డి (పట్టణ) జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాసరెడ్డి, మేడ్చల్(పట్టణ) జిల్లా కన్వీనర్ డాక్టర్ మల్లారెడ్డి, మాధవరం కాంతారావు, డా. రాజశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story