BJP: మరో మూడు రాష్ట్రాలకు ఎస్ఈసీలను నియమించిన బీజేపీ.. తెలంగాణకు ఇంకా ఎదురుచూపులే!

by Prasad Jukanti |   (  Updated:2025-06-27 12:22:44  IST  )

బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో మళ్లీ కదలిక మొదలైంది.

BJP: మరో మూడు రాష్ట్రాలకు ఎస్ఈసీలను నియమించిన బీజేపీ.. తెలంగాణకు ఇంకా ఎదురుచూపులే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా బీజేపీ (BJP) సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. దశల వారీగా ఆయా రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో మూడు రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎలక్షన్ ఆఫీసర్స్ ను (state election officers) నియమించారు. ఈ మేరకు ఎలక్షన్ ఆఫీసర్స్ నియామక ప్రకటనను ఇవాళ బీజేపీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్ డా.కె లక్ష్మణ్ జారీ చేశారు. మహారాష్ట్ర స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ గా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఉత్తరాఖండ్ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ గా కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఎంపి రవి శంకర్ ప్రసాద్ ను నియమించారు. ఆయా రాష్ట్రాలల్లో కొత్త అధ్యక్షుల ఎంపిక, నేషనల్ కౌన్సిల్ మెంబర్ల ఎంపిక ప్రక్రియను ఈ ముగ్గురు నేతలు చేపట్టనున్నారు. అయితే ఇప్పటి వరకు 14 రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపిక పూర్తయిపోయింది. మిగిలిన రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై బీజేపీ దృష్టి సారించింది. తెలంగాణ అధ్యక్షుడి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ అధ్యక్ష పదవి రేస్ లో పలువురు ముఖ్య నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, రామచంద్రరావుతో పాటు పలువురు సీనియర్ నేతలు ప్రెసిడెంట్ రేస్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధ్యక్షుడి ఎన్నిక కోసం క్యాడర్ సైతం ఆసక్తితో ఎదురు చూస్తోంది. కొత్త అధ్యక్షుడి ఖరారు అయితే పార్టీ కొత్త ఆలోచనతో రాబోయే ఎన్నికలే లక్ష్యంగా దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయని కమలం పార్టీ క్యాంప్ లో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలనే టాక్ సైతం ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.

Next Story