నేటి నుంచి బయో ఏషియా సదస్సు

by Yella Dhawani Reddy |

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో గల ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నేడు, రేపు బయో ఏషియా సదస్సు జరగనున్నది.

నేటి నుంచి బయో ఏషియా సదస్సు
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో గల ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నేడు, రేపు బయో ఏషియా సదస్సు జరగనున్నది. లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న అధునాతన మార్పులు, శాస్త్ర పురోగతిపై ఇందులో చర్చించనున్నారు. దీనికి సుమారు 50 దేశాలకు చెందిన 3,000 మంది ప్రతినిధులు అటెండ్ కానున్నారు. ఈసారి జరగబోయే సదస్సుకు ‘క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్.. ఎక్స్​పాండింగ్​గ్లోబల్ హెల్త్ కేర్ ఫ్రాంటియర్స్’ అనే థీమ్‌ను ఎంచుకున్నారు. హెల్త్ కేర్ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ వంటి అంశాలను ఎజెండా అంశాలుగా నిర్ణయించారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి

బయో ఏషియా సదస్సులో కొత్త ఆవిష్కరణలు, దేశ విదేశాల సహకారాలు, హెల్త్ కేర్ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించనున్నారు. బయో ఫార్మాసూటికల్స్, డిజిటల్ హెల్త్, వైద్య పరికరాలు, అత్యాధునిక వైద్యం, ఆరోగ్య సంరక్షణ విధానాలపై ఈ సదస్సులో డిస్కస్ చేయనున్నారు. ప్రపంచ స్థాయిలో హెల్త్ కేర్ ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వైద్య పరిశోధనలు, బయో టెక్నాలజీ, ఫార్మాసూటికల్ ఎక్సలెన్స్‌లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో బయో ఏసియా -2025 సదస్సు లైఫ్ సైన్సెస్, హెల్త్‌ కేర్ రంగంలో మరో మైలురాయిగా నిలువనుంది.

ప్రముఖుల హాజరు

నేడు ఉదయం బయో ఏషియా ప్రారంభోత్సవ వేదిక కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, క్వీన్స్‌ ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జీనెట్ యంగ్, జీ20 షెర్పా అమితాబ్ కాంత్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించనున్నారు. ఈసారి సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీలు, పేరొందిన సంస్థలకు చెందిన సీఈవోల కాంక్లేవ్ ఏర్పాటు చేశారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్.సోమనాథ్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ చైర్మన్ సతీష్‌రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, లారస్ ల్యాబ్స్ సీఈవో డాక్టర్ సత్యనారాయణ చావా, నోవార్టిస్ ఏషియా పసిఫిక్ రీజియన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీజర్ కాన్సెప్షన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెల్ టక్కర్ తదితరులు ఈ కాంక్లేవ్‌లో తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. అమ్జెన్ చైర్మన్, సీఈవో రాబర్ట్ ఎ. బ్రాడ్‌వే, జీనోమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాట్రిక్ టాన్, మెడ్ ట్రానిక్ సీటీవో డాక్టర్ కెన్ వాషింగ్టన్, మిల్టెనీ బయోటెక్ ఎండీ డాక్టర్ బోరిస్ స్టోఫెల్ తదితరులు సదస్సుల్లో జరిగే చర్చల్లో పాల్గొననున్నారు.

ఆవిష్కరణలు, ఆలోచనలన్నీ ఒకే వేదికపై..

హైదరాబాద్‌లో జరిగే బయో ఏషియా సదస్సు చరిత్రలో అత్యంత ప్రభావంతమైనదిగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, ఆలోచనలన్నీ ఒకే వేదికపై పంచుకునే అరుదైన అవకాశాన్ని ఈ సదస్సు అందించనున్నదని చెప్పారు. సదస్సుకు కొత్త సార్టప్‌ల నుంచి అంచనాలకు మించిన స్పందన వచ్చిందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ ఇప్పటికే ముందంజలో ఉందని బయో ఏషియా - 2025 సీఈవో, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తెలిపారు. ఈసారి సదస్సులో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో రూపొందించిన దాదాపు 700 స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకోగా ఎంపిక చేసిన 80 స్టార్టప్‌లు ప్రదర్శించేందుకు అవకాశం కల్పించారు.

Next Story