TG: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-25 15:41:14  IST  )

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1.73 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, 57 వేల ఇళ్ల పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

TG: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1.73 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, 57 వేల ఇళ్ల పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. స్లాబ్ పూర్తయిన ఇళ్లు సుమారు 8వేలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే 5వేల ఇళ్ల నిర్మాణం పూర్తికానుందని, పెద్ద ఎత్తున గృహ ప్రవేశ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నట్లు వెల్లడించారు. రెండు నెలల క్రితమే లబ్ధిదారులకు ఇళ్లను మంజూరును చేయగా, వాటి పనులు ప్రారంభమై వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. మొదటివిడతలో నిరుపేదలకు (పూరెస్ట్ ఆఫ్ ది పూర్) ప్రాధాన్యతనిస్తూ ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్లను నిర్మించుకున్న వారికి ఇంతవరకు రూ.386.12 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేస్తున్నట్లు వివరించారు. ఈ వారంలో సుమారు రూ.115 కోట్లను లబ్ధిదారులకు చెల్లించామని పేర్కొన్నారు.

20వేల ఇళ్ల రద్దు ప్రచారం అబద్ధం

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో 360 డిగ్రీల్లో పరిశీలించిన తరువాతనే మంజూరు చేసినట్లు ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ క్రమంలో పలు అంశాలు ప్రభుత్వ దృష్టికి వచ్చాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులుగా ఎంపికైన సుమారు 12,700 మంది అభ్యంతరాలు గుర్తించగా ఆయా జిల్లా కలెక్టర్లతో వీటిపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా నివేదిక తెప్పించామని తెలిపారు. ఇళ్లు మంజూరైన వీరిలో సుమారు 10,750 మంది గైడ్ లెన్స్ ప్రకారం అర్హులేనని తేలినట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఇంకా పరిశీలనలు జరుగుతున్నాయని, ఇంతవరకు నిబంధనలకు విరుద్ధంగా 1,950 మందికి ఇళ్లు మంజూరైనట్లుగా గుర్తించామని, వారి స్థానంలో అర్హులైన నిరుపేదలను గుర్తించాలని కలెక్టర్లకు సూచించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు మంజూరైన 1,950 మందిలో ఆర్సీసీ స్లాబ్ ఇంటిలో నివసిస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, గతంలోని పథకాల్లో ఇల్లు పొందిన వారు ఉన్నట్లుగా గుర్తించామని వివరించారు. ఇవన్నీ కూడా ప్రాథమిక స్థాయిల్లోనే గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. 20 వేల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేసినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Next Story