ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ వార్షికోత్సవం వేళ.. ఐదు ప్రముఖ ఆలయాలకు బాంబు బెదిరింపులు

by Ramesh Naini |

ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ 42వ వార్షికోత్సవానికి (జూన్ 6) మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో పంజాబ్‌లో తీవ్ర కలకలం రేగింది.

ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ వార్షికోత్సవం వేళ.. ఐదు ప్రముఖ ఆలయాలకు బాంబు బెదిరింపులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ 42వ వార్షికోత్సవానికి (జూన్ 6) మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో పంజాబ్‌లో తీవ్ర కలకలం రేగింది. రాష్ట్రంలోని ఐదు ప్రముఖ దేవాలయాలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. అమృత్‌సర్‌లోని చారిత్రాత్మక దుర్గియానా ఆలయంతో పాటు పఠాన్‌కోట్‌లోని ముక్తేశ్వర్ ధామ్, జలంధర్‌లోని దేవి తలాబ్ మందిరం, బటిండాలోని మైసర్ ఖానా ఆలయం, పటియాలాలోని మాతా కాళీ ఆలయాలకు ఈ బెదిరింపు మెయిల్స్ అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి. గతంలో విద్యాసంస్థలు, సచివాలయానికి వచ్చిన నకిలీ మెయిల్స్ తరహాలోనే ఇవి కూడా ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించడం లేదని అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గురు ప్రీత్ సింగ్ భుల్లార్ తెలిపారు. ఆలయాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

కేంద్ర బలగాల మోహరింపు.. ఇంటర్‌పోల్ సాయం

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పంజాబ్ అంతటా సరిహద్దు భద్రతా దళం (BSF), రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), ఐటీబీపీ (ITBP) సహా 11 కేంద్రీయ సాయుధ పోలీసు బలగాల (CAPF) కంపెనీలను రంగంలోకి దించారు. సరిహద్దు రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు దేశ వ్యతిరేక శక్తులు కుట్ర పన్నుతున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని శాంతిభద్రతల విభాగం స్పెషల్ డీజీపీ పి.కె. సిన్హా స్పష్టం చేశారు. కాగా, ఈ ఉదంతానికి సంబంధించి నకిలీ ఈ-మెయిల్ ఖాతాలను సరఫరా చేసిన ఒక బంగ్లాదేశ్ జాతీయుడిని పోలీసులు ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో అరెస్ట్ చేశారు. ఈ మెయిల్స్ వెనుక పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి కార్యకలాపాలు సాగించే శక్తుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానంతో, విదేశాల్లో ఉన్న సూత్రధారులను కనిపెట్టేందుకు పంజాబ్ పోలీసులు ఇంటర్‌పోల్ సహాయాన్ని కూడా కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మతపరమైన ప్రదేశాలు, రవాణా కేంద్రాల వద్ద 24 గంటల నిఘా, ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి.

Next Story