బోనాల జాతర 2026: ముస్తాబవుతున్న హైదరాబాద్

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్ర పండుగ, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన ఆషాఢ మాస బోనాల జాతర సంబురాలు షురూ కానున్నాయి.

బోనాల జాతర 2026: ముస్తాబవుతున్న హైదరాబాద్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర పండుగ, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన ఆషాఢ మాస బోనాల జాతర సంబురాలు షురూ కానున్నాయి. ఈ ఏడాది జూలై 19వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ చారిత్రాత్మక ఉత్సవాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. దాదాపు నెల రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలు ఆగస్టు 10వ తేదీ వరకు హైదరాబాద్ మహానగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతాయని ఉత్సవ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.

జూలై 19న ఘటాల ఊరేగింపు..

ఆషాఢ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని జూలై 19న గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తొలి బోనం సమర్పిస్తారు. అదే రోజున నగరంలోని పలు ప్రధాన ఆలయాల్లో ఘటాల ఊరేగింపు కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించనున్నారు. నాటి నుంచి ప్రతి ఆది, గురువారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణలు ఉంటాయి.

ఆగస్టు 2న ప్రధాన బోనాలు.. ఆగస్టు 3న రంగం

ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టాలు ఆగస్టు మొదటి వారంలో జరగనున్నాయి. ఆగస్టు 2 (ఆదివారం): లష్కర్ (సికింద్రాబాద్) ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో పాటు నగరంలోని ప్రధాన ఆలయాల్లో అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలను సమర్పిస్తారు. ఆగస్టు 3 (సోమవారం): సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో పవిత్ర 'రంగం' (భవిష్యవాణి) కార్యక్రమం, అనంతరం అంబారీపై అమ్మవారి సాగనంపే ఊరేగింపు వైభవంగా జరుగుతాయి. గోల్కొండతో ప్రారంభమయ్యే ఈ జాతర.. ఆ తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు, పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాల ఉత్సవాలతో ముగుస్తుంది. ఆగస్టు 10వ తేదీన ఉమ్మడి దేవాలయాల ఘటాల సామూహిక ఊరేగింపు. గజరాజుపై అమ్మవారి శోభాయాత్రతో ఈ ఏడాది ఆషాఢ బోనాల జాతర ముగియనుంది. బోనాల పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు ఏర్పాటు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ. జలమండలి, పోలీస్, విద్యుత్ శాఖల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు, భారీ బందోబస్తును కల్పించనున్నారు.

Next Story