అసెంబ్లీ సెషన్స్ వేళ బిగ్ ట్విస్ట్.. హైకోర్టులో హరీశ్ రావు లంచ్ మోషన్ పిటిషన్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-30 06:36:46  IST  )

శాసన‌సభ సమావేశాల సందర్భంగా కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాలులో కేబినెట్ భేటీ కానుంది.

అసెంబ్లీ సెషన్స్ వేళ బిగ్ ట్విస్ట్.. హైకోర్టులో హరీశ్ రావు లంచ్ మోషన్ పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: శాసన‌సభ సమావేశాల సందర్భంగా కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాలులో కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపి.. రేపు సభలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సస్పెండ్‌ చేయాలని.. ఆ నివేదికను రేవంత్ సర్కార్ అసెంబ్లీలో పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ వద్ద పరిశీలనలో ఉంది. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను కొట్టివేయాలని గతంలోనూ కేసీఆర్‌, హరీశ్‌రావు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ల ఆధారంగా గతంలో నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను అక్టోబర్‌ 7కు వాయిదా వేసింది.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే భయమెందుకు..

అసెంబ్లీలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే భయమెందుకని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సభ వాయిదా పడిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్ బాబు వాస్తవాలను వినడానికి సిద్ధంగా లేరని కామెంట్ చేశారు. తప్పులు ఎవరు చేశారో తేల్చాల్సింది కోర్టులు, ప్రజలేనని హరీశ్ రావు అన్నారు.

Next Story