- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: మైనంపల్లికి బిగ్ షాక్.. తండ్రి కొడుకులపై సొంతపార్టీలో తిరుగుబాటు
టీ కాంగ్రెస్ లో మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు రోహిత్ తీరు చర్చనీయాశంగా మారింది

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ తండ్రి కొడుకుల కీలక అనుచరులు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్ రెడ్డి, న్యాయవాది జీవన్ రావు, అజ్మీరా స్వామి నాయక్ తో పాటు కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి కేటీఆర్, హరీశ్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ వైఖరి వీరంతా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారనే ప్రచారం సంచలనంగా మారింది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఓ వైపు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేలకు సూచనలు చేస్తుంటే మరోవైపు తమ అనుచరులు పార్టీని వీడుతుంటే కంట్రోల్ చేయలేక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఆయన తండ్రి మైనంపల్లి హనుమంతరావు చేతులు ఎత్తేశారనే విమర్శలు పొలిటికల్ సర్కిల్స్ లో గుప్పుమంటున్నాయి.
తండ్రి కొడుకుల తీరుపై విమర్శలు:
ఇవాళ బీఆర్ఎస్ లో చేరిన నరేందర్ రెడ్డి, జీవన్ రావు, అజ్మిరా నాయక్ గత అసెంబ్లీ ఎన్నికల ముంగిట రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో మైనంపల్లి రోహిత్ గెలుపునకు కృషి చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా నియోజకవర్గంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఆయన తండ్రి హనుమంతరావు తీరుతో పార్టీలో వర్గ విభేదాలు గుప్పుమంటున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2008 బై ఎలక్షన్, 2009లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి మైనంపల్లి హనుమంతరావు ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం అంతా మల్కాజిగిరి నుంచే సాగింది. గత అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి నియోజర్గం నుంచి పోటీ చేయగా ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ నుంచి టికెట్ ఇప్పించుకోగలిగారు. ఈ ఎన్నికల్లో తండ్రి ఓటమి పాలవగా రోహిత్ మాత్రం విజయం సాధించారు. అయితే మెదక్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పెద్దగా పరిచయం లేని రోహిత్ గెలుపు కోసం అనేక మంది కాంగ్రెస్ లీడర్లు కృషి చేశారు. ఈ క్రమంలో మైనంపల్లి హనుమంతరావు.. తన కుమారుడి నియోజకవర్గంలో తలదూర్చుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో హనుమంతరావు వెనుకుండి చక్రం తిప్పుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీనే నమ్ముకున్న వారు, పార్టీకి అండగా నిలిచిన వారిని కాదని నిర్ణయాలు జరుగుతున్నాయనే అసంతృప్తి నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం చేసుకోవడంలో తండ్రి కొడుకులు పూర్తిగా విఫలం అవుతున్నారని అందువల్లే పార్టీలో అసమ్మతి రేగుతోందని హస్తం పార్టీలోని సీనియర్ నేతలు తమ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ తండ్రికొడుకుల తీరు వల్లే మెదక్ నియోజకవర్గ నాయకులు పార్టీని వీడే పరిస్థితులు ఏర్పడుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మైనంపల్లి హనుమంతరావు స్వగ్రామం కొర్విపల్లి నుంచే భారీ సంఖ్యలో నాయకులు కాంగ్రెస్ ను బీఆర్ఎస్ పార్టీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది.
పార్టీకి భారీగా డ్యామేజ్:
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాశంగా మారుతున్నాయి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు చాలెంజ్ గా తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తోంది. ప్రతిపక్షాలకు ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా పకడ్బందీగా వ్యవహరించాలని, ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవడం ద్వారా పార్టీ సత్తా ఎంటో చాటవచ్చని పార్టీ హైకమాండ్ అలర్ట్ చేస్తోంది. ఈ క్రమంలో పార్టీ స్థానిక నాయకులను, కార్యకర్తలను విస్మరించవద్దని ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉందనే ఆవేదనలు మెదక్ కాంగ్రెస్ వ్యక్తం అవుతున్నాయి. పార్టీ గెలుపుకోసం కష్టపడ్డ తమను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని చివరకు బయటకు చెప్పుకోలేని రీతిలో తమ కుటుంబ సభ్యులను సైతం దూషిస్తున్నారని తండ్రి కొడుకులపై తాజాగా పార్టీ మారిన నేతలు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇక ఇదిలా ఉంటే తొలిసారి గెలుపొంది రాజకీయాల్లో ఎన్నో విషయాలు నేర్చుకోవడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపాల్సిన మైనంపల్లి రోహిత్ తన నోటి దురుసు తనం వల్ల పార్టీకి నష్టం తెస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఆయన తండ్రి మైనంపల్లి హనుమంతరావు సైతం సొంత పార్టీ నేతలనే కోవర్టులు అంటూ విరుచుకుపడుతున్నారనే పార్టీలోకి కొత్తగా వచ్చిన ఈ తండ్రి, కొడుకులు పార్టీనే నమ్ముకున్న నాయకుల మధ్య కుంపటి రేపుతున్నారని దీంతో పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఫాదర్ అండ్ సన్ వ్యవహారంలో నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.






