Naa Anveshana Instagram : యూట్యూబర్ అన్వేష్‌కు బిగ్ షాక్! ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్!

by Ramesh Naini |   (  Updated:2026-02-19 16:13:47  IST  )

వివిధ దేశాలను చుట్టేస్తూ తన ట్రావెల్ వీడియోలతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)కు బిగ్ షాక్ తగిలింది.

Naa Anveshana Instagram : యూట్యూబర్ అన్వేష్‌కు బిగ్ షాక్! ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను చుట్టేస్తూ తన ట్రావెల్ వీడియోలతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)కు బిగ్ షాక్ తగిలింది. సుమారు 1.3 మిలియన్ల (13 లక్షలు) ఫాలోవర్లు ఉన్న ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో అన్వేష్ తన వీడియోలలో భారత్, హిందూ దేవుళ్లపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఆయన ప్రవర్తన ఉందని, మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ నటి కరాటే కళ్యాణి గతంలో హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

పోలీసుల రంగప్రవేశం - మెటాకు లేఖ

ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు, అన్వేష్ పోస్ట్‌లు ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా తొలుత అకౌంట్ వివరాలను సేకరించిన పోలీసులు, ఆపై అన్వేష్ కంటెంట్ దేశ సమగ్రతకు, సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించేలా ఉందని గుర్తించారు. దీంతో సదరు అకౌంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మెటా ప్రతినిధులకు అధికారికంగా లేఖ రాశారు.

మాయమైన 1.3 మిలియన్ల ఫాలోవర్స్ అకౌంట్

పోలీసుల నుండి అందిన పక్కా ఆధారాలను పరిశీలించిన ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం, తమ గైడ్‌లైన్స్‌ను అతిక్రమించినందుకు గానూ ‘నా అన్వేషణ’ అకౌంట్‌ను బ్లాక్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అన్వేష్ ప్రొఫైల్ సెర్చ్ చేస్తే 'యూజర్ నాట్ ఫౌండ్' అని వస్తోంది. ఆయన పోస్ట్‌లు, ఫీడ్ అంతా మాయమైపోయాయి. ఒక్కసారిగా భారీ ఫాలోయింగ్ ఉన్న అకౌంట్ కనుమరుగు కావడంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగా, గతంలో అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. హిందూ మతం, భారతదేశంపై అనుచిత కామెంట్లు చేయడంతో అతడి ఫాలోవర్ల సంఖ్య 1.3 మిలియన్లకు తగ్గిన విషయం తెలిసిందే.

Next Story