- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
50శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండి.. సుప్రీంలో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురు
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Govt) సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్‍పీ) దాఖలు చేసింది. అయితే పిటిషన్‍ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో పెండింగ్‍లో ఉన్ననందునా విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9 పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. హైకోర్టు (High Court) ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్‍పీ దాఖలు చేసింది. ఈపిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ పిటిషన్ ను కొట్టేసింది. కావాలనుకుంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లవచ్చని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలని పేర్కొంది.
హైకోర్టు నిర్ణయంలో సహేతుక కారణాలు లేవు
ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వి (Abhishek Singhvi) వాదనలు వినిపిస్తూ.. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై పార్టీలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయన్నారు. తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించామన్నారు.డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్‍లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని దేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించామని కోర్టుకు తెలిపారు. గవర్నర్ బిల్లు పెండింగ్‍లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును గవర్నర్ పెండింగ్‍లో పెట్టారని కోర్టుకు వివరించారు. బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారని రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహానీ జడ్జిమెంట్‍లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి, అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపి ఎంపరికల్ డేటా సేకరించిందని, కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించామన్నారు. బీసీ జనాభా డేటా ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు పెంచినట్టు కోర్టుకు వివరించారు. దీనిపైన స్టే ఎలా విధిస్తారు? హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవన్నారు. ఎంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గౌలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు.
తెలంగాణలో అలాంటి ఏరియాలు లేవు:
ప్రతివాది మాధవరెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసిందని షెడ్యూల్డ్ ఏరియా, గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఉందని వాదించారు. జనరల్ ఏరియాలలో రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచడానికి వీలులేదని తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవన్నారు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెల్లడించిందని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‍లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించిందన్నారు.
హైకోర్టు వైపు అందరి చూపు:
బీసీ రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఉన్న ఒక ఆప్షన్ పూర్తయింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో ఇప్పుడు అందరి చూపు హైకోర్టువైపు మళ్లింది. ఈ అంశంలో ఇప్పటికే విచారణ జరుపుతున్న హైకోర్టు తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? హైకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.






