- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గూడ్స్ వాహనదారులకు భారీ రిలీఫ్.. ఆ పన్ను విధానానికి స్వస్తి
గూడ్స్ వాహనదారులకు ఊరటనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రవాణా రంగంలో ఏళ్లుగా ఇబ్బందికరంగా మారిన త్రైమాసిక పన్ను విధానానికి మంగళం పాడాలని రవాణా శాఖ నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గూడ్స్ వాహనదారులకు ఊరటనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రవాణా రంగంలో ఏళ్లుగా ఇబ్బందికరంగా మారిన త్రైమాసిక పన్ను విధానానికి మంగళం పాడాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసే గూడ్స్ రవాణా వాహనాలకు ప్రతీ మూడు నెలలకోసారి పన్ను కట్టాల్సిన పనిలేదు. దీనికి బదులుగా వాహనం కొనుగోలు సమయంలోనే ఒకేసారి లైఫ్ ట్యాక్స్ (జీవితకాల పన్ను) వసూలు చేసే సరికొత్త విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక ప్రకటన చేయగా.. వాహనం ధరలో 7.5 శాతాన్ని లైఫ్ ట్యాక్స్ రూపంలో వసూలు చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నది.
పన్ను ఎగవేతకు చెక్.. ఖజానాకు కిక్
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం గూడ్స్ వాహనాలు ప్రతీ మూడు నెలలకు ఒకసారి రవాణా శాఖకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రవాణా శాఖ గణాంకాల ప్రకారం దాదాపు 25 శాతం మంది వాహన యజమానులు సకాలంలో ఈ పన్ను చెల్లించడం లేదు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుండటమే కాకుండా, పన్ను కట్టని వాహనాలను పట్టుకోవడానికి రవాణా శాఖ అధికారులు రోడ్లపై నిరంతరం తనిఖీలు చేయాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిపాదించిన లైఫ్ ట్యాక్స్ విధానం ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఉపయుక్తంగా మారనుంది. కొత్త విధానం ప్రకారం, వాహనం కొన్నప్పుడే 7.5% లైఫ్ ట్యాక్స్ చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దీనివల్ల వందశాతం పన్ను వసూలవుతుంది. ఒకసారి లైఫ్ ట్యాక్స్ కట్టిన వాహనాన్ని పన్ను కోసం అధికారులు ఆపాల్సిన పనిలేదు. అటు అధికారులు, ఇటు వాహనదారులకు సమయం ఆదా అవుతుంది.
వాహనదారునికి లాభమా? నష్టమా?
సాధారణంగా గూడ్స్ వాహనాలకు పదేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఆ తర్వాత ఫిట్‌నెస్ ఆధారంగా మరో మూడేళ్లు, ఆపై మరో రెండేళ్లు (మొత్తం సుమారు 15 ఏళ్లు) అనుమతి ఇస్తారు. ఆ తర్వాత వాహనాన్ని స్క్రాప్ (తుక్కు) కింద మార్చాల్సిందే. పదిహేనేళ్లపాటు ప్రతీ మూడు నెలలకు ఒకసారి పన్ను కట్టడం, మధ్యలో మర్చిపోతే పెనాల్టీలు కట్టడం వాహనదారులకు భారంగా మారుతున్నది. దీనికి బదులుగా ఆరంభంలోనే 7.5శాతం పన్ను కట్టడం వల్ల దీర్ఘకాలంలో యజమానులకు ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రతి మూడు నెలలకోసారి ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పని కూడా తప్పుతుంది. ట్యాక్స్ చెల్లించకుండా ఆర్టీఏ అధికారులను తప్పించుకుని తిరిగే అవసరం ఉండబోదు.
పాత వాహనాలకు వర్తించదు..
ఈ కొత్త విధానం కేవలం షోరూమ్ నుంచి కొత్తగా కొనుగోలు చేసే గూడ్స్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న (పాత) వాహనాలు మాత్రం యథావిధిగా పాత పద్ధతిలోనే త్రైమాసిక పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం గూడ్స్ వాహనాల నుంచి రవాణా శాఖకు భారీ ఆదాయం వస్తున్నది. అయితే కొత్త విధానం వల్ల ప్రభుత్వానికి, వాహనదారులకు మధ్య జరిగే లావాదేవీల తీరు మారనుంది.
ప్రస్తుతం.. త్రైమాసిక పన్ను రేట్లు..
ప్రస్తుతం వాహనం మోసే బరువును బట్టి పన్ను వసూలు చేస్తున్నారు. చిన్న గూడ్స్ వాహనాలు (3000 కేజీల లోపు) త్రైమాసికానికి సుమారు రూ. 1800 - రూ. 2500 వరకు, మధ్య రకం వాహనాలు (3000 - 7500 కేజీలు) త్రైమాసికానికి సుమారు రూ. 3500 - రూ. 5000 వరకు, భారీ వాహనాలకు త్రైమాసికానికి రూ. 6000 పైన వసూలు చేస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖకు ఏటా సుమారు రూ. ఆరు వేల కోట్ల నుంచి రూ.ఏడు వేల కోట్ల వరకు ఆదాయం వస్తున్నది. ఇందులో గూడ్స్ వాహనాల వాటానే ఎక్కువ. కొత్తగా వచ్చే లైఫ్ ట్యాక్స్ విధానం వల్ల... మొదట్లో ప్రభుత్వానికి ఒకేసారి భారీ మొత్తం సమకూరుతుంది. కానీ, దీర్ఘకాలంలో ప్రతి మూడు నెలలకు వచ్చే ఆదాయం మాత్రం ఆగిపోతుంది. అయినా ఎగవేతలను అరికట్టడం ద్వారా ఆ లోటును భర్తీ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.
మరింతగా పెరగనున్న లైఫ్ ట్యాక్స్..
2025-26లో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు రూ.6,165 కోట్ల ఆదాయాన్ని రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకోగా, రూ.5,142 కోట్లు వసూలైంది. ఇందులో వివిధ రకాల వాహనాలకు జీవిత కాల పన్నుల ద్వారా రూ.3,611 కోట్లు వచ్చింది. అంటే లైఫ్ ట్యాక్స్ తోనే 70.2 శాతం ఆదాయం సమకూరింది. గూడ్స్ వెహికల్స్ కు సైతం లైఫ్ ట్యాక్స్ తీసుకువచ్చిన తర్వాత.. రవాణా శాఖకు వసూలు అయ్యే లైఫ్ ట్యాక్స్ భారీగా పెరిగే అవకాశముంది.






