ధర్మపురి అర్వింద్‌కు పెద్ద ప్రమోషన్?.. బీజేపీలో హాట్ టాపిక్!

by Ramesh Naini |

బీజేపీ ఫైర్ బ్రాండ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురికి త్వరలో కీలక పదవి దక్కనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ధర్మపురి అర్వింద్‌కు పెద్ద ప్రమోషన్?.. బీజేపీలో హాట్ టాపిక్!
X

బీజేపీ ఫైర్ బ్రాండ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురికి త్వరలో కీలక పదవి దక్కనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ నెలలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పార్టీ సంస్థాగత మార్పుల్లో అర్వింద్ పేరు రేసులో ఉంది. గతంలో రెండు సార్లు చేతిదాకా వచ్చి చేజారిన పదవి.. ఈ సారైనా దక్కుతుందా అని అనుచరులు గంపెడాశలు పెట్టుకున్నారు. బండి సంజయ్ కుటుంబ వివాదాల నేపథ్యంలో తెలంగాణ కోటాలో అర్వింద్‌కు ప్రాధాన్యత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర మంత్రి పదవి కంటే తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ పోస్ట్ దక్కితేనే పార్టీని అధికారంలోకి తేవడం సులువని అర్వింద్ భావిస్తున్నారు. ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇస్తూ నేషనల్ ఫిగర్‌గా మారిన అర్వింద్‌కు ఏ పదవి దక్కుతుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బీజేపీలో తన దూకుడు, ముక్కుసూటి మాటలతో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురికి ఈసారి కీలక పదవి దక్కనుందా? అనే చర్చ పార్టీ వర్గాల్లో బలంగా నడుస్తోంది. ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ అధిష్టానం.. ఈ సారి తెలంగాణపై గట్టిగా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కమలం పెద్దలు భావిస్తున్నారు. ఇదే సమయంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ వివాదం రాజకీయంగా పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో, ఒకవేళ కేంద్ర కేబినెట్‌లో మార్పులు జరిగితే తెలంగాణ కోటాలో అర్వింద్ పేరు ముందు వరుసలో ఉండనున్నట్లు వినిపిస్తోంది. గతంలో రెండు సార్లు చేతిదాకా వచ్చి చేజారిన పదవి.. ఈసారైనా వరిస్తుందని కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు.

అర్వింద్ సంచలనాలకు మారు పేరు..

నాడు సీఎం కేసీఆర్ తనయ కవితపైనే పోటీ చేసి భారీ మెజారిటీతో ఓడించిన అర్వింద్.. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. అప్పటి నుంచి ఆయన తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. ఎన్నోసార్లు మొహమాటం లేకుండా సొంత పార్టీ నేతలపైనే సూటిగా మాట్లాడి వార్తల్లో నిలిచారు. కేంద్రంలోని కీలక నేతలతో సన్నిహితంగా మెలుగుతూ పార్టీలో తన ప్రాబల్యాన్ని పెంచుకున్న అర్వింద్.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చే దమ్మున్నోడే పార్టీకి చీఫ్‌గా రావాలని బహిరంగంగానే పలుమార్లు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల విమర్శలకు గణాంకాలతో, ఆధారాలతో మీడియా ముఖంగా చెమటలు కక్కించే నైజం ఉండడంతో ఆయన దూకుడే ఆయనకు పెద్ద అసెట్‌గా మారింది.

కేంద్ర పదవి కంటే స్టేట్ చీఫ్‌పైనే మక్కువ..

జూన్ రెండో వారంలో కేంద్ర మంత్రి వర్గంతో పాటు పార్టీ పదవుల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే, కేంద్ర మంత్రి పదవి కన్నా అర్వింద్‌కు బీజేపీ స్టేట్ చీఫ్ (రాష్ట్ర అధ్యక్షుడు) పోస్టులపైనే ఎక్కువ ఆసక్తి ఉందని ఆయన ముఖ్య అనుచరుల ద్వారా తెలుస్తోంది. గతంలో కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తరహాలోనే దూకుడుగా ఉండే నాయకత్వమే ఇప్పుడు తెలంగాణ బీజేపీకి కరెక్ట్ అని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని క్యాడర్ నమ్ముతోంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్న అర్వింద్‌కు స్టేట్ చీఫ్ పోస్ట్ దక్కితేనే తన లక్ష్యసాధన సులువవుతుందని భావిస్తున్నారు. మరి కొద్ది రోజులు ఆగితే అర్వింద్‌ను ఏ పదవి వరిస్తుందో తేలిపోనుంది.

Next Story