- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్ద పదవులు బీజేపీలో కష్టమైన పని.. ఎంపీ డా. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా జనగణన ఆరు నెలలో పూర్తి జరుగుతుందని, తరువాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ డా. లక్ష్మణ్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా జనగణన ఆరు నెలలో పూర్తి జరుగుతుందని, తరువాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ డా. లక్ష్మణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. తెలంగాణలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశముందన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వీలైనంత తొందరగా జనగణన పూర్తి చేస్తామని, అడ్డగోలుగా చేయకుండా శాస్త్రీయ పద్ధతిలో చేస్తామని, దీంతో నియోజకవర్గాల విభజన సక్రమంగా జరుగుతుందన్నారు. దేశాభివృద్ది బీజేపీతో సాధ్యం, కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని ఎత్తుగడలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీలో సంస్థాగత ప్రక్రియ అనేది ఒక పండుగ వాతావరణంలో సాగిందని, సంఘటన్పర్వ్లో భాగంగా జాతీయ అద్యక్షుని ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహించినందుకు రాంచందర్ రావు తనకు ఫోన్ చేసి సన్మాన కార్యక్రమం చేయడంతో పాటు ఎంపికలో జరిగిన అనుభవాలు పంచుకుందామని సూచించినట్లు పేర్కొన్నారు.
జాతీయ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కాస్తా ఆలస్యం..
‘అక్టోబర్ 2024 నుంచి నేను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నాను. బీజేపీలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగింది. మూడు సంవత్సరాల కొకసారి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరుగుతోంది. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా బీజేపీ సిద్ధాంతాలు, విధానాలకు అనుగుణంగా పార్టీ రాజ్యాంగాన్ని చదవాలి. బీజేపీ అంతర్గత ప్రజాస్వామ్య అధ్యక్ష ఎన్నికపై ఇతర పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నారు. చాలా రాష్ట్రాల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని అన్నీ పరిష్కారం చేసి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరిగింది’ అని అన్నారు. ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కాస్తా ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని, మూడు ఏండ్లుగా పార్టీలో పనిచేస్తేనే క్రియాశీలక సభ్యత్వం వస్తోందన్నారు. ఇతర పార్టీల్లో సభ్యత్వం అంటే ఎమ్మెల్యేలు సొంతంగా ఖర్చు చేసి సభ్యత్వాలు చేస్తారు.. బీజేపీలో మాత్రం ఉచితంగా ఆన్ లైన్ లోనే సభ్యత్వ అవకాశం ఉంటుందన్నారు. ఎన్నిక ప్రక్రియ ఇతర పార్టీల ఎన్నికలకు పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. కుటుంబ పార్టీలాగా మా పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఉండదని గతంలో బీజేపీకి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక బ్యాలెట్ ద్వారా జరిగిందని గుర్తు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి ఒక నేత వచ్చి నామినేషన్ వేస్తానంటే వారి 12 ఏండ్ల క్రియాశీలక సభ్యత్వం చూపించమని అడిగితే చూపించలేదు.. జాతీయ అధ్యక్షుడు కావాలంటే కనీసం 12 ఏండ్ల క్రియాశీలక సభ్యత్వం ఉండాలన్నారు.
తెలంగాణ నుంచి 25 మంది జాతీయ కౌన్సిల్ మెంబర్లు ఉన్నారని, అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో వీళ్లు కీలక పాత్ర పోషించారన్నారు. నామినేషన్ ప్రక్రియలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు సైతం ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. 45 సంవత్సరాల నేత నితిన్ నబీన్ ను జాతీయ అధ్యక్షుడిగా అవకాశం దక్కింది.. బీజేపీ బూత్ అధ్యక్షుడు కూడా జాతీయ అధ్యక్షుడిగా అయ్యే అవకాశం బీజేపీలో మాత్రం ఉందన్నారు. పార్టీ కోసం పని చేస్తే కచ్చితంగా పార్టీ గుర్తిస్తోంది.. నేతలు, కార్యకర్తలు పనితీరు కొలమానంగా వారికి అవకాశాలు ఉంటాయి.. రాత్రికి రాత్రే పెద్ద పదవులు కావాలంటే బీజేపీలో సాధ్యం కాదు.. ప్రధాన మంత్రి మోడీ ముందు చూపుతోనే ఇప్పుడు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని నేతలు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని విమర్శలు చేశారు.






