- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
BIG News: అఫెన్స్.. డిఫెన్స్..! ఫిరాయింపులపై బీఆర్ఎస్ జోడు వ్యూహాలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్ జోడు వ్యూహాలతో అడుగులేస్తున్నది. ఒకవైపు చట్టపరంగా ఎమ్మెల్యేల అనర్హతపై న్యాయస్థానాల్లో కొట్లాడుతూనే ఇంకోవైపు కాంగ్రెస్‌లో చేరకుండా ఆత్మరక్షణ ఎత్తుగడలను అవలంబిస్తున్నది. ఆషాఢ మాసం రావడానికి ముందే పది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. తరువాత మరికొందరు చేరడానికి సిద్ధమైనా మంచి ముహూర్తాలు లేవన్న కారణంగా ఆసక్తి చూపలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఇక వెళ్లేవారెవరూ లేరనే మెసేజ్ ఇవ్వడానికి గులాబీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అప్పటికే కాంగ్రెస్‌లో చేరినా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు పిలిచి ఆయనతో ముచ్చటించి తిరిగి సొంత గూటికి చేరారనే కాన్ఫిడెన్సును కలిగించారు.
చేరికలపై ఎవరి ధీమాలో వారు
ఆషాఢం పూర్తయిన తర్వాత కొందరు గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతారనే టాక్ అప్పట్లోనే వినిపించినా ప్రస్తుతం సీఎం రేవంత్ అమెరికా టూర్‌లో ఉండడంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనే టెన్షన్ రెండు పార్టీల్లోనూ వ్యక్తమవుతున్నది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయిన కొందరు నాలుగైదు రోజులు ఆలస్యమైనా కాంగ్రెస్ గూటికి రాక తప్పదన్న ధీమాతో ఉన్నారు. అదే సమయంలో ఇక పార్టీని విడిచి వెళ్లేవారెవరూ లేరని, వెళ్లినవారూ తిరిగి వస్తారనే ధీమాను కేటీఆర్ సహా పలువురు ముఖ్యులు సొంత పార్టీ నేతలకు అర్థం చేయిస్తున్నారు. ప్రస్తుతం గుంభనంగా ఉన్న చేరికల వ్యవహారం పంద్రాగస్టు తర్వాత ఏ షేప్ తీసుకుంటుందనే చర్చ మొదలైంది.
కట్టడి వ్యూహం ఫలించినట్లేనా..
పార్టీని విడిచి వెళ్లి కాంగ్రెస్‌లో చేరితే అనర్హత వేటు తప్పదనే అస్త్రాన్ని బలంగా వినిపించాలన్నది బీఆర్ఎస్ అభిప్రాయం. ఒకవేళ హైకోర్టులో తీర్పు ఎలా వచ్చినా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకంతో ఉన్నది. పార్టీ ఫిరాయిస్తే వేటు తప్పదని, ఉప ఎన్నికలు జరగడం అనివార్యమన్న మెసేజ్ ద్వారా సొంత పార్టీ నేతలు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా అఫెన్స్ స్ట్రాటెజీని అవలంబిస్తున్నది. కోర్టుల్లో పిటిషన్‌లు వేయడం ద్వారా పార్టీని వీడకుండా ఎమ్మెల్యేలను కట్టడి చేయాలన్నది దాని వెనక ఉన్న ఉద్దేశం. నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో ఇంకెంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తారో అనే చర్చ ఎలాగూ ఉన్నది. ఇంకా నాలుగేండ్లకు పైగా ఈ ప్రభుత్వం కొనసాగనున్నందున ఎమ్మెల్యేలు కూడా పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనే అనుమానమూ వెంటాడుతున్నది.
పంద్రాగస్టు తరువాత ఏం జరగనుంది..
ఆషాఢ మాసం ఎఫెక్టుతో చేరికలకు పడిన బ్రేక్ తాత్కాలికమా?... ఇంతటితో ఫిరాయింపులు ఆగిపోయినట్లేనా?... లేక పంద్రాగస్టు తర్వాత మళ్లీ ఊపందుకుంటాయా?... బీఆర్ఎస్ శాసనసభా పక్షం విలీనం అయ్యేంత వరకూ దారితీస్తుందా?... రానున్న స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్‌కు గ్రౌండ్ లేకుండా చేయడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా?... ఇలాంటి చర్చలూ జరుగుతున్నాయి.