- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG News: నో అపాయింట్‌మెంట్..! వర్క్ ఉందంటూ వెనక్కి పంపుతున్న అధికారులు
సమస్యలు చెప్పుకునేందుకు సెక్రెటేరియట్‌కు వస్తున్న విజిటర్స్‌కు కొందరు ఐఏఎస్‌లు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: సమస్యలు చెప్పుకునేందుకు సెక్రెటేరియట్‌కు వస్తున్న విజిటర్స్‌కు కొందరు ఐఏఎస్‌లు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. ‘బిజీగా ఉన్నాం.. ఇప్పుడు ఎవరినీ కలవడం కుదరదు’ అంటూ తెగేసి చెబుతూ వెనక్కి పంపిస్తున్నారని తెలుస్తున్నది. సెక్రెటేరియట్‌లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజిటర్స్ టైమ్‌గా నిర్ణయించారు. ఈ సమయంలో సందర్శకులు లోపలికి వచ్చి సంబంధిత శాఖ అధికారులతో నేరుగా తమ సమస్యలు చెప్పుకోవచ్చు. వినతి పత్రాలు సమర్పించొచ్చు. ఫైల్ మూమెంట్ గురించి సమాచారం తెలుసుకోవచ్చు. కానీ, పలువురు ఐఏఎస్‌లు మాత్రం విజిటర్స్‌ను కలిసేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. బిజీగా ఉన్నామని, ముఖ్యమైన ఫైల్ స్టడీ చేస్తున్నామంటూ వెనక్కి పంపిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొందరు ఐఏఎస్‌లు తమ శాఖకు చెందిన మంత్రి సెక్రెటేరియట్‌లో లేకపోతే ఏకంగా ఇంటికి వెళ్లిపోతున్నట్టు సమాచారం. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు నిరాశతో వెనక్కి వెళ్లిపోతున్న పరిస్థితి.
ఆసక్తి చూపని సీఎస్
సీఎస్ శాంతికుమారి మొదటి నుంచీ విజిటర్స్‌ను కలిసేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం ఉన్నది. ఆమె పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను సైతం వినేందుకు చొరవ చూపరనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్‌లోకి వచ్చిన తర్వాత సెక్రెటేరియట్‌లోని 6వ అంతస్తుకు వెళ్లేందుకు సందర్శకులకు అనుమతి లేదు. దీంతో సీఎస్‌ను కలవడం పెద్ద సవాలుగా మారింది. ఎవరైనా తమకు ఉన్న పరిచయాలతో సీఎస్ చాంబర్‌కు వెళ్లి కలిసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం ఉండదని, సీఎస్ పేషీలో తమ దరఖాస్తులు, వినతి పత్రాలు ఇచ్చి వెనక్కి వస్తున్నామని విజిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య 6వ అంతస్తులో ప్రభుత్వ సలహాదారుడు వేంనరేందర్‌రెడ్డిని కలిసేందుకు పెద్ద ఎత్తున విజిటర్స్ వచ్చారు. వారంతా వారండాల్లో అటు ఇటు తిరుగుతుంటే చూసిన సీఎస్.. విజిటర్స్‌ను ఎవరు రాణించారని సెక్యూరిటీ స్టాఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
విజిటర్స్‌ను రానివ్వొద్దని ఆదేశాలు
విజిటర్స్ కోసం కేటాయించిన సమయంలోనూ సందర్శకులను రానివ్వొద్దని తన పేషీ సిబ్బందికి హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా జెడ్.చోంగ్తు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారంలో ఉన్నది. ఎవరైనా తమ గోడు చెప్పుకునేందుకు ఆమె చాంబర్‌కు వస్తే.. ‘మేడం బిజీగా ఉన్నారు’ అంటూ సిబ్బంది వెనక్కి పంపుతున్నట్టు విమర్శలున్నాయి. ‘మేడంను కలిసే వెళ్తాం.. ఎంత సేపైనా చాంబర్ బయట వెయిట్ చేస్తాం’ అని విజిటర్స్ మొండికేస్తే వారిని రాత్రి పొద్దు పోయేంత వరకూ వేయిట్ చేయించి చివరికి కలిపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో సమస్యలు వినేందుకు హెల్త్ సెక్రెటరీ ఇంట్రస్ట్ చూపకుండా హడావుడిగా వినతి పత్రాలు తీసుకుని వెనక్కి పంపుతున్నట్టు విజిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనిపించని సందీప్
ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియా విజిటర్ టైమ్‌లో చాంబర్‌లో కనిపించిన సందర్భాలు చాలా తక్కువనే విమర్శలున్నాయి. సారు ఎక్కడున్నారని పేషీ స్టాఫ్‌ను విజిటర్స్ ఆరా తీస్తే.. ఒకసారి డిప్యూటీ సీఎం వద్ద మీటింగ్‌లో ఉన్నారని, మరోసారి ట్రాన్స్‌కో ఆఫీసులో ఉన్నారని సమాధానం ఇస్తున్నారు. దీంతో అనేక మంది విజిటర్స్ ఆయన పెషీలో లేకపోతే ఫైనాన్స్ శాఖలోని సంబంధిత సెక్షన్‌లో వినతి పత్రాలు ఇచ్చి వెళ్లిపోతున్నారు.
మారని స్మితా సబర్వాల్ తీరు
బీఆర్ఎస్ పాలనలో సీఎంవోలో కీలక శాఖల బాధ్యతలు చూసిన స్మితా సబర్వాల్.. నాడు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కలిసేందుకు వచ్చినా.. సమయం ఇవ్వలేదని విమర్శలు ఉండేవి. చివరికి సీనియర్ మంత్రుల ఫోన్లను సైతం అటెండ్ చేసేవారు కాదని టాక్. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం ఆమెపై అదే తీరు విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల పాటు లూప్ లైన్‌లో ఉన్న స్మితా.. తనకు ఉన్న పరిచయాలతో ఏఐసీసీలో లాబీయింగ్ చేయించుకుని మళ్లీ ప్రయారిటీ పోస్టులోకి వచ్చారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం ఆమె టూరిజం సెక్రెటరీగా కొనసాగుతున్నారు. విజిటర్స్‌ను కలిసేందుకు ఆమె ఇంట్రస్ట్ చూపడం లేదని, ఎవరైన కలిసేందుకు వస్తే చిరాకు పడతారనే సెక్రెటేరియట్ వర్గాల్లో టాక్.
అక్కడ విజిటర్ టైమ్ గంట మాత్రమే
సెక్రటేరియట్‌లో రోజూ రెండు గంటల పాటు విజిటర్ టైమ్ ఉంటే.. విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా మాత్రం కేవలం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకే (గంట మాత్రమే) సందర్శకులను కలుస్తున్నారు. అంతకంటే ముందు ఎవరు వచ్చినా అనుమతి ఇవ్వొద్దని పేషీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఆ ఇద్దరు అంతే..
ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వికి సమర్థుడైన అధికారి అనే పేరు ఉంది. కానీ ఆయన మాత్రం విజిటర్స్‌ను కలిసేందుకు ఆసక్తి చూపరని విమర్శలున్నాయి. ప్రస్తుతం రిజ్వి కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం తనను కలిసేందుకు వచ్చే విజిటర్స్‌కు టైమ్ ఇవ్వడం లేదని విమర్శలున్నాయి. ఎస్సీ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీధర్ సైతం విజిటర్స్ పేరు ఎత్తితేనే చిరాకు పడతారని ప్రచారం ఉంది. ఆయన ఎస్సీ శాఖ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండు, మూడు సార్ల కంటే ఎక్కువ రోజులు విజిటర్స్‌ను కలిసిన దాఖలాలు లేవనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తున్నది.






