BIG News: తుది దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ.. గులాబీ బాస్‌కు‌ నోటీసులు!

by Kema Shiva Kumar |

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను తుదిమెరుగులు దిద్దుతున్నది.

BIG News: తుది దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ.. గులాబీ బాస్‌కు‌ నోటీసులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను తుదిమెరుగులు దిద్దుతున్నది. వచ్చే నెల రెండో వారంలో ప్రభుత్వానికి సుమారు 400 పేజీలతో అందజేయనున్నట్టు సమాచారం. అంతకు ముందు మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్టు టాక్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాళేశ్వరం నిర్మించారు. కమిషన్​విచారణలో అనేక మంది అధికారులు ఆయన పేరునే ప్రస్తావించారు. ‘కేసీఆర్​ఆదేశాలు, సూచనల మేరకే నిర్ణయాలు తీసుకున్నాం’ అని కమిషన్‌ ఎదుట స్పష్టం చేశారు. వాటిని ఉటంకిస్తూ మాజీ సీఎం నోటీసులు జారీ చేసి ఆయన ఇచ్చే సమాధానాన్ని సైతం కమిషన్ తన నివేదికలో పొందుపర్చి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నది.

ఏడాదిగా విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యత, అవకతవకలపై కాంగ్రెస్​ప్రభుత్వం 2024లో విచారణకు ఆదేశించింది. అదే ఏడాది ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు రిటైర్డ్​జడ్జి పినాకీ చంద్రఘోష్‌తో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఆయన విచారణ ప్రారంభించి సుమారు సంవత్సరం కావస్తున్నది. విచారణ ముగియడానికి అవసరమైన నివేదికను కమిషన్ ఇప్పటికే సిద్ధం చేసింది.

అనేక మందికి నోటీసులు, క్రాస్ ఎగ్జామినేషన్

విచారణలో భాగంగా కాళేశ్వరం కమిషన్​ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. వారిని క్రాస్​ఎగ్జామినేషన్​సైతం చేసింది. వీరిలో సోమేశ్‌కుమార్, ఎస్.కే జోషి, రజత్‌కుమార్, స్మితాసబర్వాల్, రామకృష్ణారావుతో పాటు కాళేశ్వరం బ్యారేజీ పనులు చూసిన ఏఈ నుంచి ఈఎన్‌సీ వరకు అందరినీ విచారించింది. నీటిపారుదల రంగంలో, కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన ఉన్న వారు ఇలా సుమారు 100 మందికిపైగా అధికారులను చంద్రఘోష్​విచారణ చేశారు. ఆ సందర్భంగా అనేక మంది బ్యారేజీల నిర్ణయం, వాటి ప్రాంతాలు మార్చడం, నిబంధనలకు విరుద్ధంగా నీటి నిల్వ వంటి నిర్ణయాలను కేసీఆర్​ఆదేశాలతోనే అమలు చేశామని స్పష్టం చేశారు. వీరందరూ చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ కేసీఆర్‌కు సైతం నోటీసులు జారీ చేసి.. ఆయన వివరణ తీసుకొని తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు సమాచారం.

పరిగణనలోకి ఎన్‌డీఎస్ఏ ​నివేదిక

కాళేశ్వరంపై ఎన్‌డీఎస్ఏ (నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ)​నివేదికను సైతం జస్టిస్ ఘోష్ కమిషన్ పరిగణనలోకి తీసుకోనున్నది. ఆ నివేదిక ప్రామాణికం కాకపోయినా అందులో పేర్కొన్న సాంకేతికత, విచారణలో నీటిపారుదల శాఖ అధికారులు చెప్పిన వివరాలన్నీ సరిపోయాయా? లేదా? అనే కోణంలో పరిశీలించనున్నట్టు సమాచారం.

అసెంబ్లీ ముందుకు రిపోర్టు

కాళేశ్వరం నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం దానిని అధ్యయనం చేసి ఆరు నెలల్లోగా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. జ్యుడీషియల్​కమిషన్​నివేదికలను సహజంగానే ప్రభుత్వాలు అసెంబ్లీ ముందు ఉంచాల్సి ఉంటుంది. రిపోర్టు అందిన తర్వాత గరిష్ఠంగా ఆరు నెలల వరకు సమయం తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Next Story