- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG News: అప్పుడే కేబినెట్ ప్రక్షాళన.. క్లారిటీ ఇచ్చిన అధిష్టానం
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణతో పాటు శాఖల మార్పులు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణతో పాటు శాఖల మార్పులు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడే పనితీరు సరిగాలేని మంత్రులను పక్కన పెట్టి, వారి స్థానంలో కొత్త వారిని కేబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మంత్రుల శాఖల మార్పుపై రెండు, మూడ్రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లైంది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు తన వద్ద ఉన్న శాఖలను కేటాయించారు.
నివేదికల ఆధారంగా ప్రక్షాళన
రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని కేబినెట్ ప్రక్షాళన చేయాలని ఢిల్లీ పెద్దలు సూచించినట్లు తెలుస్తున్నది. ఒకటి... మంత్రులుగా ఆ శాఖలో సాధించిన ప్రగతితోపాటు అవినీతి ఆరోపణలు పరిగణలోకి తీసుకోనున్నారు. రెండోది... స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రుల పనితీరు ప్రామాణికం కానుంది. ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకొని ప్రక్షాళన చేపట్టనున్నారు. కాగా కొందరు మంత్రులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పార్టీ అధిష్టానం చేసిన సర్వేల్లోనూ ఇది స్పష్టమైనట్లు తెలిసింది. అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రుల వద్ద నుంచి శాఖలు తొలగించి, ఇతర శాఖలు కేటాయించాలని అధిష్టానం ముందుగా భావించింది. అయితే అలా చేయడం వల్ల మంత్రులు అవినీతికి పాల్పడ్డారని సర్టిఫికెట్ పార్టీ అధిష్టానం ఇచ్చినట్లుగా సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంటుందేమోనని పునరాలోచనలో పడింది. శాఖల మార్పును ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల రిజల్ట్ ఆధారంగా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తే విమర్శలకు తావుండదని రాహుల్, ఖర్గే నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రక్షాళన టైమ్‌లోనే పూర్తి కేబినెట్
కొత్తగా ముగ్గురు మంత్రులను తీసుకోగా, మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ మూడు స్థానాలకు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. దీనితో వాటిని భర్తీ చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. అయితే కేబినెట్ ప్రక్షాళన చేసే సమయంలోనే ఖాళీగా ఉన్న మూడు స్థానాలను సైతం భర్తీ చేయనున్నారు. అలాగే పనితీరు సరిగాలేని మంత్రులను తప్పించి, అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అవకాశాన్ని అధిష్టానం పరిశీలిస్తోంది.
మరో 6 నెలల నిరీక్షణ
మంత్రి పదవికోసం ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా జరిగిన విస్తరణలో అవకాశం రాకపోవడంతో అలకపూనారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల తరువాత జరిగే ప్రక్షాళనలో ఖచ్చితంగా అవకాశం ఉంటుందని మీనాక్షి నటరాజన్ స్వయంగా హామీ ఇవ్వడంతో కూల్ అయ్యారు. అయితే ఎన్నికలు ముగిసిన తరువాత డిసెంబర్ చివర లేదా జనవరిలో కేబినెట్ ప్రక్షాళన చేసే చాన్స్ ఉంది. దీనితో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు మరో 6నెలల పాటు ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.






