BIG News: ‘ఫార్మాసిటీ’ భూసేకరణ అక్రమాల పుట్ట..! లేని భూమికి పరిహారం

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-06 01:54:24  IST  )

ఫార్మా సిటీ పేరిట గత ప్రభుత్వం ముచ్చర్లలో భూసేకరణ చేపట్టింది.

BIG News: ‘ఫార్మాసిటీ’ భూసేకరణ అక్రమాల పుట్ట..! లేని భూమికి పరిహారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్మా సిటీ పేరిట గత ప్రభుత్వం ముచ్చర్లలో భూసేకరణ చేపట్టింది. అయితే ఈ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగినట్లు చర్చ జరుగుతున్నది. భూమి లేకున్నా, పొషెషన్ లో లేకున్నా అలాంటి భూములకు పరిహారం అందజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా రూ.వందల కోట్ల అవినీతి చోటు చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అప్పటి రంగారెడ్డి కలెక్టర్, ఇబ్రహింపట్నం ఆర్డీవో, యాచారం, కందుకూరు తహశీల్దార్లు ఇందులో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. ఈ రెండు మండలాల్లో వేలాది ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించారు. అయితే హక్కుదారులు, పట్టాదారులు ఎవరు? రికార్డుల్లో ఎవరు ఉన్నారు? అమ్మేసినా మ్యుటేషన్ కాకపోవడం వల్ల రెవెన్యూ రికార్డుల్లో కొనసాగుతున్న వారు ఎవరు? ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తలు తీసుకోకుండానే పరిహారం చెల్లించారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా భూదాన్ భూములకు సంబంధించి అక్రమార్కులకు నష్టపరిహారం చెల్లించారన్న ఫిర్యాదులు పెండింగులోనే ఉన్నాయి. ఫార్మా సిటీ భూ సేకరణపై సమగ్ర దర్యాప్తు చేస్తే అక్రమార్కులు, అవినీతి అధికారుల బండారం బయటపడుతుందని రైతులు చెబుతున్నారు.

ప్రభుత్వ ఖజానాకు నష్టం..

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో 250 ఎకరాల భూదాన్ భూములను ఫార్మా సిటీలో కలిపేశారు. అయితే ఆ భూములకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు నష్టపరిహారం చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లల్లో నష్టం వాటిల్లింది. ఈ భూములపై ఎన్నాళ్లుగానో వివాదం కొనసాగుతున్నది. గ్రామసభలోనూ అది భూదాన్ ల్యాండ్ అని, తాము దున్నుకుంటున్నామంటూ అధికారులకు రైతులు మొర పెట్టుకున్నారు. పలుమార్లు లిఖితపూర్వకంగానూ చెప్పారు. అయినా చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పుడు తమ భూమికి వేరే వాళ్లకు పరిహారం ఇచ్చారంటూ మరికొందరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా వందలాది ఎకరాల భూమిపై హక్కులు లేకపోయినా ప్రభుత్వ సొమ్మును కాజేశారని తెలుస్తున్నది.

భూమి అమ్మేసినా పరిహారం..

యాచారం మండలం కుర్మిద్ద సర్వే నం.287లో భారీ అవకతకవలు చోటు చేసుకున్నాయి. ఒకాయనకు ఈ సర్వే నంబరులో 1.23 ఎకరాల పట్టా భూమి ఉంది. అందులో 0.23 ఎకరాలను డాక్యుమెంట్ నం.6112/2009 ద్వారా అమ్మేశాడు. ఆ తర్వాత మిగిలిన ఎకరం డాక్యుమెంట్ నం.5805/2017 ద్వారా మరొకరికి అమ్మేశాడు. దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ నం.బి/1711/51/2017, బి/2876/2009 ద్వారా మ్యుటేషన్ ఆర్డర్లు రిలీజ్ చేశారు. దీంతో అతడి పేరిట భూమి ఉండడానికి అవకాశమే లేదు. కానీ ఏకంగా రూ.20.40 లక్షలు నష్టపరిహారంగా పొందాడు. కొనుగోలు చేసిన వారి పేరిట భూమిని రికార్డుల్లో నమోదు చేశారు. కానీ అమ్మేసిన వ్యక్తి పేరిట కూడా అలాగే కొనసాగించారు. నిజానికి ఇలా చేయడం ద్వారా ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించకుండానే రెవెన్యూ అధికారులు నష్టపరిహారం అందజేశారంటూ ఇటీవల భూమి కొనుగోలు చేసిన రైతులు ఇబ్రహింపట్నం ఆర్డీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. భూములు కోల్పోయిన వారికి ఫార్మా సిటీ ప్రాంతంలో లే అవుట్ డెవలప్ చేసి ప్లాట్లు కూడా ఇస్తున్నారు. భూమి లేకపోయినా ఓ వైపు నష్టపరిహారం పొందారు. ఇప్పుడు ప్లాట్ కూడా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఉదంతాలు ఫార్మా సిటీ భూ సేకరణలో అనేకం ఉన్నట్లు యాచారం మండల రైతులు చెబుతున్నారు.

భూదాన్ బోర్డు కార్యదర్శి లేఖ రాసినా..

భూదాన్ భూములను ఇతర అవసరాలకు వినియోగించొద్దని భూదాన్ యజ్ఞ బోర్డు చట్టంలో ఉంది. ఒకవేళ ఎవరికైనా కేటాయిస్తే అతను వ్యవసాయం చేయకపోతే స్వాధీనం చేసుకొని తిరిగి పేదలకే అసైన్ చేయాలి. తాటిపర్తి సర్వే నం.104లో ప్లాట్లు పంపిణీ చేయొద్దని 2023 మార్చి 24న ఆర్డీవోకు లిఖితపూర్వకంగా అర్జీ పెట్టుకున్నారు. అవినీతి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరికీ ప్లాట్లు ఇవ్వొద్దని కోరారు. భూదాన్ ఉద్యమ సమయంలో 250 ఎకరాల భూమి దాతలు ఇచ్చారని, అది పేదలకు పంపిణీ చేశారన్నారు. అనేక ఏండ్లుగా పేదలు వ్యవసాయం చేసుకుంటున్నారని, వారిని కాదని అనర్హులకు నష్టపరిహారం అందజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2006 జనవరి 12న తాటిపర్తి సర్వే నం.104, 172లో భూదానంగా ఇచ్చిన భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, వెంటనే క్రయ విక్రయాలను నిలిపివేయాలని యాచారం తహశీల్దార్‌కి భూదాన్ యజ్ఞ బోర్డు కార్యదర్శి లేఖ రాశారు. అందుకు సంబంధించిన భూదాన పత్రాలను కూడా అందజేశారు.

2023 ఏప్రిల్ 12న 250 ఎకరాల భూమిని భూదాన్ చట్టానికి వ్యతిరేకంగా అమ్మకాలు సాగిస్తున్నారని, ఎన్నో ఏండ్లుగా దళితులు, బీసీలు దున్నుకుంటున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేశారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా అది కంచెగానే ఉందని గుర్తు చేశారు. 1983లోనే తమకు పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ కార్యదర్శి ఆదేశించారని పేర్కొన్నారు. 250 ఎకరాల భూదాన్ భూమికి ఎకరానికి రూ.16 లక్షల వంతున నష్టపరిహారాన్ని అనర్హులకు అందించారని ఆరోపించారు. సుమారు రూ.50 కోట్లు చేతులు మారిందని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ 77 మంది రైతులు సంతకాలు చేసి కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. అయితే నష్టపరిహారం పొందిన వారిలో పెద్దలు ఉండడంతో ఎంక్వయిరీ కూడా చేయడం లేదు. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

100 మీటర్ల రోడ్డులోనూ వివాదాలు

యాచారం, కందుకూరు మండలాల్లో అసైన్డ్ భూముల సేకరణలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఎలాంటి పొషెషన్ లేని వారికి నష్టపరిహారం అందించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూమిని తక్కువ చేసి.. అంత అసైన్డ్ భూమిలో నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. రికార్డులను సరిగ్గా వెరిఫై చేయకుండానే భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేయడం, సేకరించడం.. వెంట వెంటనే సాగిపోయాయి. ప్రస్తుతం వంద మీటర్ల రహదారి నిర్మాణానికి భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులోనూ భూములు లేని వాళ్లు ఉన్నారని కుర్మిద్ద రైతులు అంటున్నారు. ఫార్మా సిటీలో నష్టపరిహారం పొందిన వారి పేర్లు ఈ నోటిఫికేషన్ లో కనిపిస్తున్నాయంటున్నారు. ఇప్పటికే ఫార్మా సిటీ భూమిగా ప్రభుత్వం సేకరించింది. ఇప్పుడేమో ఎయిర్ పోర్ట్ అథారిటీ చేపట్టనున్న భూ సేకరణ ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రభుత్వానికి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఓ సారి గతంలో జారీ చేసిన జాబితాలతో సరిపోల్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అక్రమాలకు సహకరించిన రెవెన్యూ అధికారులపై దర్యాప్తు చేయాలని ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన, కోల్పోతున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story