- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెలివరీ బాయ్స్‌కి భారీ గుడ్‌న్యూస్.. గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేక బోర్డు సైతం
గిగ్ వర్కర్స్‌కి భారీ శుభవార్త.. వారి సంక్షేమానికి రూపొందించిన బిల్లుకు సోమవారం కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: (Gig workers) గిగ్ వర్కర్స్‌కి భారీ శుభవార్త.. వారి సంక్షేమానికి రూపొందించిన బిల్లుకు సోమవారం కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీని ద్వారా వారికి ఉద్యోగ భద్రత, బీమా, కనీస వేతనాలకు భరోసా లభించనుంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డుతో పాటు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి సంక్షేమ, సామాజిక భద్రతా కార్యక్రమాలు అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది గిగ్ ప్లాట్‌ఫామ్ కార్మికులు ఉన్నారు. వీరు రవాణా, డెలివరీ, గృహ సేవలు, లాజిస్టిక్స్ మొదలైన వాటిలో పనిచేస్తున్నారు. వారం మొత్తం రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేసినా.. ఉద్యోగ భద్రత, చెల్లింపుల్లో పారదర్శకత లేదు. కార్మికుల నమోదుకు చట్టబద్ధమైన యంత్రాంగం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2024 డిసెంబర్ లో గిగ్ కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అన్ని విభాగాల అధికారులతోపాటు న్యాయశాఖతో సంప్రదించి తెలంగాణ ప్లాట్‌ఫారమ్ ఆధారిత గిగ్ వర్కర్స్ చట్టం-2025 ముసాయిదా బిల్లును రూపొందించగా, ఇప్పుడు దీనికి ఆమోదం లభించింది.
కార్మిక శాఖ మంత్రి చైర్మన్ గా..
కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నారు. దీనికి కార్మిక శాఖ మంత్రి చైర్మన్ గా వ్యవహరించనుండగా.. ప్లాట్ ఫామ్ కంపెనీలు, కార్మికులు, పౌర సమాజం, సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉండనున్నారు. ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉండనుంది. కార్మికుల రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాలు, సురక్షితమైన పని పరిస్థితులు, పారదర్శక చెల్లింపులు.. వంటి అంశాలను ఈ బోర్డు పర్యవేక్షించనుంది. ప్రతి ఒక్క కార్మికుడు స్వయంగా తన పేరును నమోదు చేసుకోవచ్చు. ప్లాట్‌ఫామ్ లు సైతం 60 రోజుల్లోపు కార్మికుల డేటాను షేర్ చేయాల్సి ఉంటుంది. అగ్రిగేటర్లు 45 రోజుల్లోపు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
సంక్షేమ నిధి..
కార్మికుల సంక్షేమానికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేయనున్నారు. అగ్రిగేటర్ చెల్లింపులపై సంక్షేమ రుసుము, ప్రభుత్వ గ్రాంట్లు, సీఎస్ఆర్ విరాళాలు వంటివి సంక్షేమానికి వినియోగించనున్నారు. కార్మికులను తొలగించాలంటే ముందుగానే నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. వివాదాలు, ఫిర్యాదుల పరిష్కారానికి వివాద పరిష్కార కమిటీ, అప్పీలేట్ యంత్రాంగం ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు కూడా విధిస్తారు.






