వ‌డ్డీ లేని రుణాలను రూ.10 లక్షలకు పెంచుతాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో మహిళలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. త్వరలోనే వడ్డీలేని రుణాలను రూ.10 లక్షలకు పెంచుతామన్నారు.

వ‌డ్డీ లేని రుణాలను రూ.10 లక్షలకు పెంచుతాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మ‌హిళా ఆర్థిక సాధికార‌త కోసం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభ‌వ‌న్‌లో 49వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల స‌మావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సంక్షేమ ప‌థ‌కాలు, ఆర్థిక స్వావ‌లంబ‌న‌, ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణం, మ‌హిళా సాధికార‌త‌, మూసీ పున‌రుజ్జీవం వంటి అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంద‌ని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి లక్ష్యాలను మించి బ్యాంకులు రుణాలు ఇవ్వడం సంతోషకరమ‌ని వ్యాఖ్యానించారు. పారిశ్రామిక రంగంలో దేశంలోనే అత్యంత వేగ‌వంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒక‌టని తెలిపారు. ఈ నేప‌థ్యంలో సూక్ష్మ, చిన్నత‌ర‌హా పరిశ్రమలు, మహిళలు, దళిత, గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు రుణాల పంపిణీపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని భట్టి విక్రమార్క సూచించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు కృషి చేయాలి: తుమ్మల

తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు మరింత కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. బ్యాంకర్ల స‌మావేశంలో పాల్గొన్న తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. దాదాపు రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీని ఒకే దశలో అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులు రుణాల చెల్లింపులో క్రమశిక్షణ పాటిస్తున్నందున.. బ్యాంకులు పెట్టుబడి రుణాల మంజూరులో ఆలస్యం చేయొద్దని కోరారు. దాదాపు 30 శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారని, వారికి సకాలంలో పంట రుణాలు అందివ్వాలని మంత్రి తుమ్మల సూచించారు. దీనివల్ల అధిక వడ్డీ, ప్రైవేట్ అప్పులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందన్నారు.

Next Story